హైదరాబాద్, మే 28 (నమస్తేతెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల ఆర్తనాదాలు సర్కార్కు వినిపిస్తలేదా? మెదక్, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి.. జిల్లాలు ఏవైనా పండించిన పంటను అమ్ముకోలేక తెలంగాణ రైతాంగం తల్లడిల్లుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా దక్కక రేవంత్రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర రైతాంగం తీరని నష్టాల పాలవుతున్నదని ధ్వజమెత్తారు. అన్నదాత కండ్లల్లో ఆనందం కరువై, కన్నీళ్లు ఏరులై పారుతున్నాయని వాపోయారు. రైతురాజ్యం తీసుకొస్తామనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రైతులు పండించిన పంటను దళారులు, మిల్లర్లు దోపిడీ చేస్తుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ధ్వజమెత్తారు. పంటలను సకాలంలో కొనుగోలు చేసి రైతులకు ఆర్థిక భద్రత కల్పించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెప్పిన మాటలను రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న అవస్థలు చూస్తుంటే పాలకుల వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నదని విమర్శించారు.
నల్లచట్టాలు చేసి రైతాంగానికి తీరని ద్రోహం చేసిందని గతంలో కేంద్రంలోని మోదీ సర్కార్ను నిలదీసిన కాంగ్రెస్.. అధికారంలో ఉన్న తెలంగాణలో అదే మోదీ పంథానే అనుసరించడం దురదృష్టకరమని సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఒకవైపు అకాల వర్షాలతో ప్రకృతి పగబడితే, మరోవైపు ప్రభుత్వ ముందస్తు ప్రణాళికారాహిత్యం అన్నదాతను నట్టేట ముంచిందని ఆరోపించారు. సంచుల్లో మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతుల గుండెలు బాదుకున్నా కాంగ్రెస్ సర్కార్లో కదలికలేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వానలు పడుతాయని సమాచారమున్నా టార్పాలిన్లు సమకూర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రతి గింజా కొంటామని సర్కార్ పెద్దలు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ ఆచరణ దిశగా అడుగులేయడమే లేదని దుయ్యబట్టారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దేడ్చిన ఎవుసం మనుగడ సాగించదనే విషయాన్ని పాలకులు గ్రహించాలని హితవుపలికారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పంటల కొనుగోలులో వేగం పెంచాలని, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొద్దునిద్ర వీడకుంటే బీఆర్ఎస్ తరఫున రైతాంగానికి అండగా పోరాడుతామని స్పష్టంచేశారు.
మేము ఇంత గోస పడుతుంటే, పాలకులు పట్టించుకోవడం లేదు.. అధికారులు ఇటువైపు చూడటం లేదు. మా వడ్లు కల్లంలోనే పోయేలాగా ఉన్నాయి. వర్షం వస్తే పంట మొత్తం పోయినట్టే. అసలు రైతులంటే ఇంత చులకన ఎందుకు? పంటలు సకాలంలో కొనని లీడర్లు ఎందుకు. అంతటా ఇదే పరిస్థితి ఉంటే సర్కార్ ఏం చేస్తున్నది. ఓ దిక్కు పంట కాపాడుకునేందుకు కష్టపడలే.. ఇప్పుడు పంట అమ్ముకునేందుకు కష్టపడాలే. గతంలో గింత కష్టం లేకుండే. ఇప్పుడు ఇట్ల అయితదని అనుకోలే.
– సోమారపు వెంకటయ్య, రంగాపురం, జనగామజిల్లా