Congress | హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): ఇటీవల బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ కండువా కప్పుకొని వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమితులైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడి, గుత్తా అమిత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఝలక్ ఇచ్చినట్టు సమాచారం. వారి నియామకాలపై అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. అందుకే పదవీ బాధ్యతలు చేపట్టలేదంటూ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. వీరి నియామకంపై ఉత్తర్వులు వెలువడి వారం గడుస్తున్నా బాధ్యతల స్వీకరణ ఊసెత్తకపోవడం గమనార్హం. వీరి నియామకానికి వ్యతిరేకంగా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి వెంటనే పదవులివ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో అధిష్ఠానం వారి నియామకాలను ఆపేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డికి కూడా భంగపాటేననే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
పార్టీలో తీవ్ర వ్యతిరేకత
పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని పక్కనపెట్టి, కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుత్తా అమిత్‌రెడ్డి నియామకంపై నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్టు తెలిసింది. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పని చేసిన మోహన్‌రెడ్డి, శంకర్‌నాయక్ వంటి వారికి ఇంకా పదవులే దక్కలేదని, ఇప్పుడు పార్టీలో చేరిన గుత్తా అమిత్‌కు రెడ్ కార్పెట్ పరిచి చైర్మన్ పదవి ఇవ్వడమేమిటని వారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. నల్లగొండలో ఇప్పటికే రేవంత్ వర్గానికి చెందిన చాలామందికి పదువులు దక్కడంపై కూడా ఆ జిల్లా నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విధంగా చూస్తూ పోతే జిల్లాలో తమ ఉనికే ప్రశ్నార్థకం చేస్తారని, తమను నమ్ముకున్న వారికి మొండిచెయ్యే మిగులుతుందని కీలక నాయకులు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే పదవుల నియామకంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు సమాచారం.