జనగామ, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది నెలల్లో పదేండ్ల విధ్వంసాన్ని సృష్టించిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్లో ఆయన మాట్లాడారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని కేసీఆర్ తెలంగాణ సాధించారని పేర్కొన్నారు. లగచర్ల, దిలావర్పూర్ గిరిజనులు నడుంకట్టి పోరాటం చేస్తే రేవంత్రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని వెనకి తీసుకున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఎకడ ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా తామంతా ప్రత్యేక రాష్ర్టానికి అనుకూలంగా ఇచ్చిన లేఖలో సంతకం పెట్టకుండా తప్పించుకు తిరిగిన తెలంగాణ ద్రోహి రాష్ర్టానికి సీఎం కావడం దురదృష్టమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ‘కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేదా..? రేవంత్రెడ్డి సీఎం అయ్యేవాడా? అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి బూడిద భిక్షమయ్యగౌడ్ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. లగచర్ల, దిలావర్పూర్ ఘటనలు రేవంత్రెడ్డి సర్కారుకు చెంపపెట్టు లాంటివని పేర్కొన్నారు.