Palla Rajeshwar Reddy | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ గోరంత అయితే చెప్పేది కొండంత ఉందని, గోబెల్స్ బతికి ఉంటే కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను చూసి ఆత్మహత్య చేసుకునేటోడని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసింది ఆరువేల కోట్లేనని, మొత్తం రుణాలున్న రైతుల్లో 30 శాతం మందికే రుణమాఫీ అయిందని, డబ్బుల పరంగా చూస్తే ఇది కేవలం 20 శాతం మాత్రమేనని, ఇంకా లక్ష రుణం మాఫీకాని రైతులు లక్షల్లో ఉన్నారని తెలిపారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో మొద టి విడతలో 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణమాఫీ చేశామని, రెండో విడత 37.33 లక్షల మందికి రూ.19 వేల కోట్లు సిద్ధం చేసుకొని రూ.12 వేల కోట్లు చెల్లించామని గుర్తుచేశారు.
ఇంకా ఏడు వేల కోట్లపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆ మొత్తం చెల్లించకుండా ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ ఏడు వేల కోట్లు ఇప్పుడు మంత్రుల కాంట్రాక్టు సంస్థలకు వెళ్లాయని ఆరోపించారు. లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయంలో రూ.19 వేల కోట్లుంటే ఇపుడు 6వేల కోట్లకు ఎలా తగ్గిందని, దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులుంటే 11లక్షల మందికే రుణమాఫీ ఎలా చేశారని ప్రశ్నించారు. ఆంక్షల పేరిట రుణమాఫీని కొందరు రైతులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రైతుల అకౌంట్లలో సంక్షేమ పథకాల కింద లక్ష కోట్లు జమయ్యాయని, ఇందులో 72 వేల కోట్లు రైతు బంధు ద్వారా, 28 వేల కోట్లు రుణమాఫీ కింద జమ చేశామని చెప్పారు. రైతులకు కేసీఆర్ పాలన ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని విమర్శించారు. కేసీఆర్ కట్టిన 2604 రైతు వేదికల్లో కాంగ్రెస్ సంబురాలు చేసుకున్నదని, కేసీఆర్ కట్టిన సచివాలయం నుంచే సీఎం రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. పంట సీజను దాటుతున్నా రైతు భరోసా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.
హరీశ్‌రావు సవాల్‌ను వక్రీకరించారు
హరీశ్‌రావు రాజీనామా సవాల్‌ను సీఎం, కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని పల్లా తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలతో పాటు రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్ విసిరారని గుర్తుచేశారు. ఇప్పటికీ హరీశ్‌రావు ఆ సవాల్‌కు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. రాజీనామాల నుంచి పారిపోయింది రేవంత్ అని, నిలకడగా నిలబడ్డది హరీశ్‌రావు మాత్రమేనని పల్లా తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కోవా లక్ష్మి, బీఆర్ఎస్ నేతలు రాకేశ్‌రెడ్డి, రాంబాబు యాదవ్, తుంగ బాలు పాల్గొన్నారు.