జనగామ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘చిన్నచిన్న కారణాలు చెప్పి రైతులకు సాగునీరు, జనగామ పట్టణ ప్రజలకు తాగునీళ్లు ఇవ్వకుండా చీటకోడూరు రిజర్వాయర్‌ను ఎండబెడుతరా? మొన్నటి దాకా మేం (కేసీఆర్ ప్రభుత్వం) నీళ్లు ఇచ్చాం కదా? ఎవరైనా నీళ్లు ఇవ్వద్దని మీకు చెప్పారా?’ అంటూ నీటిపారుదల శాఖ సీఈ అశోక్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి ఫోన్లో నిలదీశారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, కౌన్సిలర్లు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి జనగామ జిల్లా జనగామ మండలం చీటకోడూరు రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఫుట్‌బాల్స్ తేలి నీరు అడుగంటడాన్ని చూసి ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే సంబంధిత దేవాదుల, నీటిపారుదల శాఖ ఉమ్మడి జిల్లా అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.
జనగామ పట్టణ ప్రజలకు తాగునీరు అందించే రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరిందని,మూడు ఫుట్బాల్స్లో రెండు పైకి తేలాయని, రెండు, మూడురోజుల్లో నీరు మొత్తం అడుగంటి జనగామ ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే అశ్వరావుపల్లి నుంచి జనగామకు తాగునీటి కోసం నీళ్లు వదలాలని కోరారు. ధర్మసాగర్ నుంచి ఆర్ఎస్ ఘన్‌పూర్‌కు నీటిని వదిలి రెండో పంపు ఆన్ చేస్తే.. అక్కడి నుంచి అశ్వారావుపల్లికి వచ్చి.. అక్కడి నుంచి చీటకోడూరుకు నీళ్లు రావడానికి నాలుగురోజులు పడుతుందని వివరించారు.
ధర్మసాగర్ నుంచి గండిరామారానికి కూడా నీటిని విడుదల చేయాలని సూచించా రు. తపాస్‌పల్లి, బొమ్మకూర్, గండిరామారం రిజర్వాయ ర్ల ఆయకట్టు కింద 40 శాతం కూడా నాట్లు పడలేదని, నార్లు ముదిరిపోతున్నాయని, చిన్న చిన్న కారణాలు చెప్పి నీళ్లు వదలకుండా రైతులను గోస పెడుతరా? అంటూ సీఈ అశోక్ కుమార్‌ను ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి నిలదీశారు.