హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ, ధాన్యానికి బోనస్, రైతుభరోసా, ఆసరా పింఛన్ పెంపును ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు ఎగవేతలకు కేరాఫ్‌గా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రెండు నెలలవుతున్నా ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు.
హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పూర్తయ్యేదాకా రైతుభరోసా ఇవ్వబోమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ పేరిట రైతులను బక్వాస్ చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ బోగస్ సర్కారుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.