ఖమ్మం, జూలై 7 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అగ్గిపుట్టిస్తామని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూ. 2 లక్షల నగదును సాయంగా అందించారు.
అనంతరం మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి పల్లా మీడియాతో మాట్లాడారు. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని, డబ్బులు ఇవ్వనిదే అధికారులు ఏ పనిచేయడం లేదని ఆరోపించారు.
రెవెన్యూ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి సహా పలువురు మంత్రులు నాలుగు చేతులా సంపాదిస్తున్నారని మండిపడ్డారు. 40 ఏండ్లుగా భూమిని సాగుచేసుకుంటూ 11సార్లు రైతుబంధు తీసుకున్న ప్రభాకర్ భూమికి ట్రెంచ్కొట్టి చెరువులో కలపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టబద్ధంగా ఉన్న ప్రభాకర్ 7.1 ఎకరాలను రక్షించలేని రెవెన్యూ యంత్రాంగం ఉండి ఎందుకని ప్రశ్నించారు.
ఆదరాబాదరాగా భట్టి పరామర్శ
ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని వారం రోజులైనా పరామర్శించని డిప్యూటీ సీఎం భట్టి తాను, హరీశ్‌రావు వస్తున్నామని తెలిసి ఆదరాబాదరాగా వచ్చి కంటితుడుపు చర్యగా పరామర్శించి వెళ్లడం బాధాకరమని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభాకర్ ఆత్మహత్యకు కారణమైన తహసీల్దార్, సీఐని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతోపాటు పిల్లలకు అండగా నిలవాలని కోరారు.
ప్రభాకర్ ఆత్మహత్యకు కారణమై, ఏ1గా ఉండాల్సిన నిందితుడిని భట్టి విక్రమార్క తన కారులో తిప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధమూ లేని గ్రామ పెద్ద పుల్లయ్యపై కేసు పెట్టించి ఇబ్బందులు పెట్టడాన్ని దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. అన్యాయంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చింతకాని మండలం వచ్చారని, దళితబంధు పథకాన్ని ఇక్కడి నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రతినిధుల బృందానికి తప్పని నిరీక్షణ
ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ శనివారం ప్రజాప్రతినిధుల బృందాన్ని ఎంపిక చేసింది. పరామర్శకు వస్తున్న విషయాన్ని ప్రభాకర్ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతోపాటు రెవెన్యూ, పోలీసు అధికారులకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు సమాచారం అందించారు. ఉదయం 9:30 గంటలకు గ్రామానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంకాగా డిప్యూటీ సీఎం వస్తున్నారని కొంత సమయం వేచి ఉండాలని పోలీసులు సూచించడంతో దాదాపు రెండుగంటల పాటు వారు పార్టీ కార్యాలయంలో నిరీక్షించాల్సి వచ్చింది.
ప్రభాకర్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి
రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిసి వినతిపత్రం అందించింది. ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలు, ప్రేరేపించిన అంశాలు, కేసు నమోదులో జరిగిన పరిణామాలను సీపీకి వివరించారు. కాంగ్రెస్ నాయకుడు కూరపాటి కిశోర్ ప్రమేయం, ఆయన వల్ల తనకు జరిగిన నష్టంపై రైతు ప్రభాకర్ వీడియోలో వెల్లడించాడని, అయినప్పటికీ కిశోర్ పేరును ఎఫ్ఐఆర్లో 12వ పేరుగా నమోదు చేశారని సీపీ దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నాయకులను ఏ1, ఏ3లుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని ఆరోపించారు. పెద్ద మనిషిగా వెళ్లిన పుల్లయ్యపై కేసు నమోదు చేయడం దారుణమని, కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలను విన్న సీపీ ప్రభాకర్ మృతిపై లోతైన విచారణ జరిపి, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, తాతా మధుసూదన్, లింగాల కమల్‌రాజు, సండ్ర వెంకటవీరయ్య, పగడాల నాగరాజు, బెల్లం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
‘నమస్తే’ వార్తకు స్పందించిన ప్రభుత్వం
అధికారుల నిర్లక్ష్యంతో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని వారం రోజులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం కథనం ప్రచురితమైంది. ఆదివారం బీఆర్ఎస్ నాయకుల బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లబోతున్నదని పేర్కొంది. దీంతో స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక షెడ్యూల్లో లేకపోయినప్పటికీ ఆదివారం ప్రొద్దుటూరు వెళ్లి ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అయితే, ఆ వెంటనే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూరపాటి కిశోర్ ఇంటికి భట్టి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.