చేర్యాల, జనవరి 18 : రైతులతో పాటు అన్నివర్గాలను కాంగ్రెస్ సర్కారు నిండాముంచిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్ యార్డులో శనివారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచిందన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని, 2లక్షల వరకు రుణమాఫీ పూర్తిస్థ్ధాయిలో చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ప్రతి రైతుకు రూ.15వేల రైతుభరోసా ఇవ్వాలని, ఉపాధి కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంది పంటను నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సూచించారు.
చేర్యాలలో ప్రొటోకాల్ ఉల్లంఘన
కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైడ్రామా చోటుచేసుకుంది. కందుల కొనులు కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. కాగా ఎమ్మెల్యే రాకముందే డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పల్లా చేర్యాల మార్కెట్‌యార్డుకు వస్తున్నారని తెలుసుకున్న అధికారులు హుటాహుటిన తిరిగి రిబ్బన్ ఏర్పాటు చేసి కొబ్బరికాయలు తీసుకువచ్చి కేంద్రం ఏర్పాటుకు ఏర్పాట్లు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి కాంగ్రెస్ నాయకులు అప్పటికే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులు, కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.