హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ‘అవి ఇస్తం.. ఇవి ఇస్తం అని ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలిచ్చిండ్రు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని అడిగితే దాడులు చేయిస్తున్నరు. గ్రామసభల్లో అర్హులను పకనబెట్టి అనర్హులకు పథకాలు అందిస్తున్నరు’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామం నరసయ్యపల్లిలో నిర్వహించిన గ్రామసభకు 100 మంది గూండాలతో వెళ్లి రేషన్‌కార్డు, ఇల్లు ఇవ్వాలని అడిగిన గ్రామస్థులపై దాడి చేశారని మండిపడ్డారు. తమకు పథకాలు రాలేదని ప్రశ్నించిన మంతెన బాల్‌రెడ్డి అనే వ్యక్తిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు అండగా నిలిచిన మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్‌తో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నియోజకవర్గంలోని వడ్లకొండలో తమ కు ఇల్లు రాలేదని అడిగిన ఓ యువకుడిపై తీవ్రంగా దాడి చేశారని తెలిపారు.