ఎల్కతుర్తి, ఏప్రిల్ 18 : పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తే, అలవికాని హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కారు 16 నెలల్లోనే తెలంగాణను మళ్లీ తెర్లు చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అద్భుతమైన సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కరీంనగర్లో నాడు నిర్వహించిన సింహగర్జన మొదలు నేటి వరకు కేసీఆర్ బ్రహ్మాండమైన సభలు నిర్వహించి ప్రజల్లో స్ఫూర్తి నింపారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కట్టిన రిజర్వాయర్లలో మోటర్లు నడిపే తెలివిలేక రేవంత్‌రెడ్డి వ్యవసాయాన్ని కుంటుపడేశారని ఆరోపించారు. 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తున్నదని చెబుతున్నారని, అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు పండితే, 2023లో 141లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఎఫ్‌సీఐకి అందించామని, మరో కోటీ 60 లక్షల మెట్రిక్ టన్నులు తినడానికి, ఇతర అవసరాలకు అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ 46వేల చెరువులకు మరమ్మతు చేసి, రిజర్వాయర్లు కడితేనే ఇదంతా సాధ్యమైందని గుర్తుచేశారు. రైతుబంధు రూ.72వేల కోట్లు, రైతుబీమా లక్షా 50వేల మందికి అందించిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. ఇప్పుడు ప్రజలంతా మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ మాట విని మళ్లీ స్ఫూర్తి పొందాలని ప్రజలంతా ఈ సభ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ దేశ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం పాల్గొన్నారు.