MLA Pailla Shekar Reddy | యాదాద్రి భువనగిరి | ఐటీ అధికారుల తీరు కొండ తవ్వి, ఎలుకను పట్టిన చందంగా ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చురకలంటించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికారులు ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. ఊహాగానాలతోనే అధికారులు దాడులు నిర్వహించారని చెప్పారు. ఒక్క రోజులో పూర్తయ్యేదానికి మూడు రోజులు తనిఖీలు చేపట్టారన్నారు. ఇంట్లో కుటుంబసభ్యులు, పిల్లలు ఉన్నారని, మూడు రోజులపాటు సోదాలు చేయడం సరికాదన్నారు.
హైదరాబాద్లో ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల అనంతరం ఆదివారం భువనగిరికి చేరుకున్న ఎమ్మెల్యేకు బీఆర్ఎస్శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 70 ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయన్నారు. దాడుల్లో ఎంతో లభిస్తాయని ఐటీ అధికారులు అనుకున్నారని, ఏం దొరక్కపోవడంతో షాక్ తిన్నారని చెప్పారు. తొలి రోజు గంటన్నరలోనే సోదాలు పూర్తయ్యాయని, మిగతా సమయమంతా క్లారిఫికేషన్కు పోయిందన్నారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇచ్చానని, అన్ని విషయాల్లో సహకరించానని తెలిపారు.
మూడు రోజులపాటు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని, లాకర్లను ఓపెన్ చేశారని క్లారిటీ ఇచ్చారు. తన మామ మోహన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారని, ఆయనను అదుపులో తీసుకున్నారనే వార్తలు అవాస్తవమని తెలిపారు. తనకు దక్షిణాఫ్రికాలో మైన్స్ బిజినెస్ ఉందని మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని, అలాంటి వ్యాపారాలు అసలే లేవన్నారు. ఇమేజీ డ్యామేజ్ చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమతి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ పాల్గొన్నారు.