హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రిలిమ్స్‌లో ఓ హాల్‌టికెట్, మెయిన్స్‌లో మరో హాల్‌టికెట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని తెలిపారు. 21,093 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే, 21,103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. 10 మంది అదనంగా ఎకడి నుంచి వచ్చారో తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 654 మందికి ఓకే రకమైన మారులు ఎలా వచ్చాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని సేకరించే మాట్లాడుతున్నానని చెప్పారు.
గ్రూప్-1 పేపర్లు 60 రోజుల్లోనే దిద్దారని, పేపర్ల వాల్యూయేషన్‌కు నాలుగైదు నెలలైనా సమయం పడుతుందని చెప్పారు. 10 వేల మంది పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం 69 మందికే ఉద్యోగాలు వచ్చాయని, 1,494 మంది మహిళలు పరీక్షలు రాసిన రెండు కేంద్రాల్లో 74 మందికి ఉద్యోగాలెలా వస్తాయని నిలదీశారు. 18, 19 కేంద్రాల్లో పరీక్షలు రాసిన ఆ 74 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ కోడలికి 206వ ర్యాంక్ వచ్చిందని, ఎస్టీల్లో ఆమెదే మొదటి ర్యాంకు అని, ఆమె 19వ నంబర్ పరీక్ష కేంద్రంలోనే పరీక్ష రాసినట్టు చెప్పారు.
ఈ రెండు పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలోనే ఉన్నాయని, ఆయా కేంద్రాల్లో మహిళలకే అవకాశం ఇచ్చారని వెల్లడించారు. మహిళలకు ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఎందుకు ఏర్పాటుచేశారని ప్రశ్నించారు. ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది పరీక్షలు రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు వచ్చాయని, తెలుగు మీడియంలో 7,800 మంది పరీక్షలు రాస్తే 70 మందికే ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఇంత తకువ మందికి ఎలా ఉద్యోగాలు వస్తాయని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో బీజేపీ నేతలు ఎగిరెగిరి పడ్డారని, ఇపుడు గ్రూప్-1 కుంభకోణంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు కుమ్మకయ్యారని ఆరోపించారు. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని, మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, కోదండరాంరెడ్డికి, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి ఉద్యోగాలు రాగానే నిరుద్యోగుల గురించి మరిచిపోతారా? అని ధ్వజమెత్తారు. తమ పార్టీ నేత రాకేశ్‌రెడ్డి ఇదే అంశంపై మాట్లాడితే నోటీసులు పంపారని, తమకు ఎన్ని నోటీసులు పంపినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ పోలీసులను పంపి తన మీద కేసులు బనాయించే అవకాశం ఉన్నదని, అయినా భయపడేది లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రం నుంచి చెరో ఎనిమిది ఎంపీ స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే రెండు పార్టీలు కలిసి అదే ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు.