వీణవంక, జూలై 4 : మంత్రి సీతక్కపై హ త్య కేసు పెట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ‘ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకులకేనా..?’ అని ప్రశ్నించిన పేద యువకుడిని పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తే ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై రద్దయిన వారి ఇళ్లను పరిశీలించి మాట్లాడారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు ప్రొసీడింగ్ కాపీలు అందిస్తే లబ్ధిదారులు తమ ఇండ్లను కూలగొట్టుకొని, అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. అధికారులే వచ్చి ముగ్గులు పోసి, మళ్లీ రద్దు చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 40వేల మందిని ప్రభుత్వం ఎంపిక చేసిందని, వారందరికీ ఇండ్లు మంజూరు చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పేదల పక్షాన అవసరమైతే జైలుకు వెళ్లడానికి సైతం సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.