అరాచకీయమే రాజకీయమైనప్పుడు అధికారమే అంతిమలక్ష్యం అవుతుంది. భూమిపై మోహం భూతమై వెంటాడుతున్నప్పుడు ప్రభుత్వ ప్రాపకమే పరమావధి అవుతుంది. ఇప్పుడదే జరుగుతున్నది. నగర శివార్ల నుంచి గెలిచిన ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు… ఇప్పుడు గెలిపించిన ప్రజలకన్నా, వారి అభిమతం కన్నా, టికెట్ ఇచ్చిన పార్టీ కన్నా, రాజకీయ నిబద్ధత కన్నా భూదందానే ప్రధానమైపోయింది. ఏండ్లుగా చెరబట్టిన వందల ఎకరాల భూమిని పూర్తిగా చేజిక్కించుకోవాలంటే సర్కారీ పార్టీలో చేరడమే సరళ మార్గమైంది.
పదేండ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వంలో ఇంచుకూడా ముందుకుసాగని ఆట.. ఆ నేతకు కాంగ్రెస్‌లో చేరితే భూమేత మేయవచ్చనే ఆఫర్ దక్కింది. ఇంకేముంది కండువా కప్పుకునేందుకు మెడ వంగిపోయింది. కేసీఆర్ సర్కారులో సాధ్యం కానిదాన్ని ఇప్పుడు సుసాధ్యం చేసుకోవచ్చన్న ఆశ సర్కారీ దొరల ముందు సాగిలపడేలా చేస్తున్నది. తెలంగాణలో ఫిరాయింపుల కోసం త్రీ-బీ (బీబీబీ) ఫార్ములా నడుస్తున్నది. అయితే భూములు, లేదంటే బిల్లులు, కాదంటే బ్లాక్ మెయిలింగ్! ఎమ్మెల్యేలను లొంగదీసుకోవడానికి ఇదీ లెక్క! ‘చెరబట్టిన భూములు నీకేఉండాల్నా? పెండింగ్ బిల్లులు విడుదల కావాల్నా? కేసులు పెట్టకుండా ఆగాల్నా? అయితే గోడదూకు! మా పార్టీలో చేరు! కండువా కప్పుకో!’ ఇప్పుడిదే ఆఫర్.. ఫిరాయింపులకు తెర లేపుతున్నది. గత్తర లేపుతున్నది!
MLA | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 11 (నమస్తే తెలంగాణ)/మణికొండ: శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో 75 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 200 ఎకరాలకు పైగా భూములు ఒక మాజీ ఎంపీ తనవంటూ డాక్యుమెంట్లు చూపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ వివాదం న్యాయస్థానానికి వెళ్లింది. ఆపై ఒక ప్రజాప్రతినిధి రంగప్రవేశం చేసి ఇరువైపులా రాజీ కుదిర్చి ఆ భూములను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేసి భారీగా లాభపడ్డారు. కేసీఆర్ హయాంలో ఈ జాగీర్దారీ భూములపై ప్రభుత్వాధికారులు న్యాయస్థానంలో పోరాటం చేశారు. దీంతో ఈ భూములపై ‘వివాదం కోర్టులో ఉన్నది’ అని ధరణిలో నమోదు చేసి మ్యుటేషన్లు నిలిపివేశారు. ఫలితంగా సదరు ప్రజాప్రతినిధి పాచిక పారలేదు.
శంషాబాద్‌లో జాతీయ రహదారిని ఆనుకుని సర్వే నంబరు 720 నుంచి 730 వరకు సుమారు 181 ఎకరాల హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. దీనిపై కన్నేసిన సదరు ప్రజాప్రతినిధి అల్లుడు కొందరిని రంగంలోకి దింపి ఆ భూములను కొట్టేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ భూములు హెచ్ఎండీఏకు చెందినవేనని తీర్పు వచ్చే వరకు పోరాడింది. కబ్జాదారులు ఎవరైనా సరే ఉపేక్షించకుండా హెచ్ఎండీఏ అధికారులు అందులోని అక్రమ నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేసి సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూము ల్ని ప్రభుత్వపరం చేశారు.
శంషాబాద్ మండలం సయ్యద్‌గూడ, చిన్న గోల్కొండ పంచాయతీ సర్వే నంబరు 24లో 200 ఎకరాలు, పెద్ద గోల్కొండ పరిధిలో సర్వేనంబర్ 114నుంచి 176వరకు 185 ఎకరాలు.. ఇలా మొత్తం 385 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నా యి. దీనిపై కన్నేసిన సదరు ప్రజాప్రతినిధి రైతులను బెదిరించి తోచినంత ముట్టజెప్పి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని, రెవె న్యూ రికార్డులను మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం ఆ అక్రమాలను అడ్డుకుంది. రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. మ్యుటేషన్లు కాకుండా కట్టడి చేసింది. శంషాబాద్ మండలం ఘాన్సిమియాగూడ పరిధిలోని సర్వే నంబర్ 4లో జాగిర్దారీ భూ ములున్నాయి.
నిరుపేదలకు దక్కాలి, లేదంటే ప్రభు త్వ ఖాతాలో ఉండాలి. కానీ కొందరు పెద్దలు ఈ భూ ములపై కన్నేసి పంచుకున్నారు. ఇందులో సదరు ప్ర జాప్రతినిధి ఐదెకరాల భూమిని మలుపుకొని ప్రహరీతో గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. గతంలో ఈ భూ ముల్ని పేదలకు పంచాలంటూ ప్రస్తుత సీఎంరేవంత్టీడీపీలో ఉన్నప్పుడు ధర్నా కూడా చేశారు. సదరు ప్రజాప్రతినిధి ఆ భూములను పట్టా భూములుగా మార్చేందుకు పదేండ్లుగా ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా వెంపర్లాడారు. కానీ ఆయన పాచిక పారలేదు.
గొల్లపల్లి, బహదూర్‌గూడ పరిధిలోని అసైన్డ్ భూములతో పాటు ఎయిర్‌పోర్టు కాలనీలో హెచ్ఎండీఏకు చెందిన 13 ఎకరాలపైనా సదరు ప్రజాప్రతినిధి, ఆయన అల్లుడు కన్నేసి స్వాధీనం చేసుకునేందుకు నానా తంటాలుపడ్డారు. కానీ కేసీఆర్ ప్రభు త్వ హయాంలో ఎప్పటికప్పుడు అధికారులు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారు. సర్కారు రికార్డుల్లో ఎక్కడా ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చే చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అందుకే ఆ ఘనత వహించిన ప్రజాప్రతినిధి ఇప్పుడు గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. ఓట్లేసిన జనాన్ని నట్టే ముంచుతూ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరికొన్ని గంటల్లోనే పార్టీ కండువా మార్చనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేండ్లుగా ఎక్కడా సందు దొరకక తికమకపడుతున్న ఈ ప్రజాప్రతినిధిని ‘భూ’ఛీని అడ్డుపెట్టుకొని అధికార కాంగ్రెస్ వల విసిరింది. బీఆర్ఎస్ కావాలా? భూములు కావా లా? అని పాచిక విసిరింది. దీంతో ఫిరాయింపునకు ముహూర్తం ఖరారైంది.
తాజాగా నగర శివారులో జంపింగ్‌కు సిద్ధమైన ఒక ఎమ్మెల్యే భూ దాహం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారం, అంతకుమించి ప్రభుత్వ, నిరుపేదల భూములను వందలాదిగా స్వాధీనం చేసుకోవాలనే చిరకాల స్వప్నంతో కండువాలు మార్చుతున్న వైనంపై పెద్ద ఎత్తున గుసగుసలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో ముచ్చటగా మూడో పార్టీ మార్చనున్న సదరు ఎమ్మెల్యే భూ లీలలను ఇప్పుడు నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నాలుగు దశాబ్దాల కిందట శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లి గ్రామ జాగీర్దార్ భూములపై వివాదం రాజుకుంది. 200 ఎకరాలకుపైగా ఉన్న ఆ భూముల్లో 75 నాగళ్లు (నాగలికి మూడెకరాలు) కింద రైతులు సాగు చేసుకునేవారు.
ఆ భూములను జాగిర్దార్ల నుంచి తాము కొనుగోలు చేశామంటూ మాజీ ఎంపీ తులసీరాం భూముల స్వాధీనానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ప్రభుత్వాలపై ఒత్తిడితెచ్చినా వివాదం కొలి క్కి రాకపోవడంతో న్యాయస్థానం పరిధిలోకి వెళ్లిం ది. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా రైతులు తమ భూములను తమకు ఇప్పించాలని వినతిపత్రం ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర ఆ దిశగా అడుగులు పడి, ఆపై వివాదం మళ్లీ మొదటికొచ్చింది. అనంతరం 2009 తర్వాత వి వాదం మరో మలుపు తిరిగింది. ఇందులోకి కొత్తగా ‘ప్రజాప్రతినిధి’ రంగ ప్రవేశం చేశారు. ప్రైవేటు కంపెనీకి ఆ భూములను కట్టబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014 తర్వాత ఈ పని కోసమే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్లోకి వచ్చినా ఆయన పాచిక పారలేదు. కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రికార్డులను ఏమార్చేందుకు ఆయన అనేకరకాల ఒత్తిడి తెచ్చినా సఫలం కాలేదు.
గతంలో భూ లావాదేవీల కోసమే సదరు ప్రజాప్రతినిధి పార్టీ మారినట్టుగా అర్థమవుతున్నదని పలువురు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. గత పదేండ్లలో ఆ పాచికలు పారకపోవడంతో తాజాగా అధికార కాంగ్రెస్ వైపు తొంగిచూశారు. అక్కడా ఇదే అదునుగా భూ గాలం విసరడంతో ఈ అక్రమాలకు మార్గం సుగమం చేస్తామనే హామీ లభించిందనే ప్రచారం జరుగుతున్నది. గత కొన్నిరోజులుగా జరిగిన చర్చల్లోనూ ఈ భూ లావాదేవీల క్లియరెన్స్ అంశమే ప్రధాన ఎజెండాగా ఉన్నదనే వార్తలు వినిపించాయి. అటువైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో అధికార పార్టీలోకి దూకేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.
సదరు ప్రజాప్రతినిధి పదేండ్లపాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములపై కన్నేయడం, ఆయన అల్లుడు రంగంలోకి దిగి కార్యా లు చక్కబెట్టడం పరిపాటిగా మారింది. హెచ్ఎండీఏ భూములపై అనేకమార్లు కన్నేసి తప్పుడు డాక్యుమెంట్లతో వాటిని స్వాధీనం చేసుకునేందు కు విశ్వప్రయత్నం చేశారు. పలుచోట్ల అసైన్డ్ రైతులను బెదిరించి అడ్డికి పావుసేరులా కొనుగోలు చేసి ప్రభుత్వ రికార్డుల్లో పట్టా మార్చేందుకు రెవెన్యూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి న సందర్భాలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ అండతో అధికారులు న్యాయస్థానాల్లో వాస్తవ డాక్యుమెంట్లతో అఫిడవిట్లు వేసి న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. పలు కేసుల్లో ప్రభు త్వం విజయం సాధించి రూ.వేల కోట్ల భూము ల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నా యి. సదరు ప్రజాప్రతినిధి అప్పట్లో ప్రభుత్వ పెద్దలను కలిసినా ఆయన కన్నేసిన వందలాది ఎకరాల భూములకు సంబంధించి రికార్డుల్లో మార్పు జరగలేదు.