ఐనవోలు, డిసెంబర్ 1 : కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 10 ఇండ్లు అదనంగా ఇస్తానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సోమవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కత్తి సుధీర్ నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పున్నేల్ అంబేద్కర్ సెంటర్ వద్ద నాగరాజు మాట్లాడుతూ.. పున్నేల్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీతో చాలా అనుబంధం ఉన్నదని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే మరో పది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానంటూ హామీ ఇచ్చారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎమ్మెల్యే ఓటర్లను ప్రలోభపెట్టేలా మాట్లాడిన వీడియోను ఎమ్మెల్యే ఆఫీసు సిబ్బందే అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కాగా పున్నేల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాయపురం సాంబయ్య కక్కిరాలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామానికి 50 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ మాట్లాడిన వీడియోను కూడా ఏకంగా వారే సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పట్టించుకోకపోవడాన్ని బీఆర్ఎస్ నాయకులు తప్పుబడుతున్నారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాయకుండా రాజ్యంగబద్ధంగా విధులు నిర్వర్తించాలని కోరుతున్నారు.