నేరేడ్మెట్, సెప్టెంబర్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలేసి హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు. వినాయకనగర్ డివిజన్ బండ చెరువు సమీపంలో మౌలాలి పరిధిలోని శంకరయ్య కాలనీ, సింహాద్రినగర్, ఎన్ఎండీసీ కాలనీ, శివానంద్నగర్కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీ ప్రజలు హైడ్రా చర్యలతో భయాందోళనకు గురవుతున్నట్టు తెలుసుకుని ఆదివారం ఆయా కాలనీల్లో పర్యటించి భరోసా కల్పించారు. పర్మిషన్లు తీసుకొని, పన్నులు చెల్లించి 30 ఏండ్ల క్రితం ఇండ్లు కట్టుకున్నామని వివిధ కాలనీల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వమంటే ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని, అలా కాకుండా వారిని ఆవేదనకు గురిచేస్తున్నదని విమర్శించారు. ప్రజలు ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని అన్ని అనుమతులతో కట్టుకున్న ఇండ్లను ఒక్కసారిగా నేలమట్టం చేయడం దుర్మార్గమని, ప్రజలు భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.