మోత్కూరు, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు ఊహించని షాక్ తగిలింది. మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు స్థానిక ఎంపీడీవో కార్యాయంలో సోమవారం ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తొమ్మిది నెలల పాలన, నియోజకవర్గంలో తన పనితీరు ఎలా ఉన్నదని మహిళలను ప్రశ్నించారు. దీనికి మోత్కూరు పట్టణానికి చెందిన బీసు యాకమ్మతోపాటు పలువురు మహిళలు స్పందిస్తూ.. ‘ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, ఆసరా పింఛన్ రూ.4వేలు ఇస్తామంటేనే ఓట్లేసినం. ఇంకెప్పుడిస్తరు?’ అని సూటిగా ప్రశ్నించారు.
దీంతో కంగుతిన్న సామేల్ తమది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమని, అన్నీ సమకూర్చుకొని హామీలన్నీ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించామని, మోత్కూరుకు మంజూరైన ఆర్టీసీ బస్సు డిపో పనులను ఐదారు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కళాశాలలు, తిరుమలగిరిలో ఇంటిగ్రేటేడ్ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కవితాలక్ష్మీనర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్ వెంకటయ్య, ఎంపీడీఓ నిరంజన్ వలీ పాల్గొన్నారు.