MLA Malreddy Rangareddy | రంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీ భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా యుద్ధం చేశామని, ఆ యుద్ధ్దంలో ఇచ్చినమాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేశామని తెలిపారు. అయితే, సదరు రైతులకు పరిహారం కూడా చెల్లించినందున ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదని స్పష్టంచేశారు. అలాగే, మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్దలో 2,500 ఎకరాల పట్టా భూములను గత ప్రభుత్వమే భూసేకరణ చేపట్టిందని అన్నారు. వాటికి పరిహారం కూడా అథారిటీలో జ మచేసినట్టు చెప్పారు.
ఆ భూములను తి రిగి రైతులకు ఇప్పించాలని భావిస్తున్నా చట్టం అడ్డువస్తున్నదని తెలిపారు. ఆ భూ ములను ఫ్యూచర్‌సిటీలో వివిధ అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పారు. ఫార్మాసిటీ కోసం నోటిఫికేషన్ ద్వారా సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇస్తామని తాను ఎన్నడూ అనలేదన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొట్టి ఆందోళనకు దిగుతున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ రద్దు అయినందున ఆ భూముల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఫ్యూచర్‌సిటీతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. తాను మొదటినుంచి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాడానని, ఫార్మా బాధిత రైతులు తనవెంట నడిచినట్టు చెప్పారు.
యాచారం మండలం నానక్‌నగర్, మేడిపల్లి, కుర్మిద్ద, తాటిపర్తిలో 2500 ఎకరాల భూములపై పీటముడి వీడటంలేదు. ఇవి పట్టా భూములని, ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టడంతో తమకు రుణాలు, రైతుబంధు రావటంలేదని, అమ్ముకోవటానికి అవకాశం లేకుండా పోయిందని, ఈ భూములను తిరిగి తమకే ఇవ్వాలని బాధిత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ భూములను తిరిగి రైతులకే ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కానీ ఈ భూములకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ చేపట్టింది. భూములకు సంబంధించిన పరిహారాన్ని కూడా అథారిటీలో జమచేసింది. రైతులు భూములను కూడా టీఎస్ఐఐసీ పేరుమీదకు బదలాయించారు. తమ అంగీకారం లేకుండా తీసుకున్న భూములను తిరిగివ్వాలని రైతులు పట్టుబడుతుండగా ప్రభుత్వం ఎటూ తేల్చులేకపోతున్నది. మంగళవారం నానక్‌నగర్‌లో భూ భారతి సదస్సును రైతులు అడ్డుకున్నారు.