హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ (ఆర్ఎస్) బ్రదర్స్ బంధం ఫెవికాల్ బంధంలా మరింత గట్టిగా మారిందని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానందగౌడ్ విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రి గా మారారని ఎద్దేవా చేశారు. లగచర్లలో గిరిజన రైతులను అక్రమంగా అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీ డీకే అరుణను లగచర్ల గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే, సంజయ్ ఎందుకు మాట్లాడలేదు? లగచర్లలో గిరిజన రైతులను అరెస్టు చేస్తే ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపర్చాలనే ఉద్దేశంతో ఆయన కుటుంబంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు బురదచల్లుతున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒకటయ్యాయని, రేవంత్, సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్‌లాగా పని చేస్తున్నారని విమర్శించారు.
కొడంగల్ అగ్నిగుండంగా మారితే సంజయ్ ఎకడ నిద్రపోయారని నిలదీశారు. కేటీఆర్ బావమరిది గృహప్రవేశ ఘటనపై తనకు నెట్వర్క్ ఉన్నదంటూ తక్షణమే స్పందించిన సంజయ్‌కి నెట్లేదు, వర్లేదు, వర్త్లేదు అని ఎద్దేవాచేశారు. కేటీఆర్‌ను వ్యక్తిగతంగా రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ అగ్నిగుండంలా మారుస్తున్నారని, పోలీసులను సీఎం తన ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారని మండిపడ్డారు. లగచర్ల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, పార్టీలకు అతీతంగా రైతులు తిరుగుబాటు చేశారని, అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారంటూ కొన్ని ఫొటోలను మీడియాకు చూపించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. లగచర్ల బెంగాల్‌లోని నందిగ్రామ్లాగా మారబోతున్నదని హెచ్చరించారు.
144 సెక్షన్ తిరుపతిరెడ్డికి వర్తించదా?: ఎర్రోళ్ల
కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారని, కానీ రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి వందల కార్లతో తిరుగుతున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తిరుపతిరెడ్డికి ఏహోదాలో ఎస్కార్ట్ వాహనాలు ఇస్తున్నారో సీఎస్, డీజీపీ, కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీ డీకే అరుణ వెళ్తే పోలీసులు వెనక్కి పంపారని, తిరుపతిరెడ్డికి ఎదురేగి పూల బోకేలను ఏ హోదాలో ఇచ్చి కలెక్టర్ స్వాగతం పలుకుతారని ప్రశ్నించారు. ఏడో గ్యారెంటీ కింద రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తున్నదని విమర్శించారు. రజాకార్ల నాయకుడిగా తిరుపతిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.