చండూరు, నవంబర్ 14 : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల మీదుగా చండూరు వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. గ్రామగ్రామాన బోనాలు, కోలాటాల బృందాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ అన్ని శాఖల మంత్రులతో త్వరలోనే సమావేశమై వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతానని స్పష్టంచేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలని సూచించారు. ఎవరైనా అభివృద్ధి పనులకు అడ్డుతగిలితే సహించేది లేదని హెచ్చరించారు. ఇరుపార్టీల కార్యకర్తలు గొడవలకు పోవద్దని, పోటీ తనకు రాజగోపాల్‌రెడ్డి మధ్యనేనని, ప్రజలు ఎంపైర్‌గా ఉంటారని చెప్పారు. పార్టీలకతీతంగా ఎవరు వచ్చినా పని చేస్తానని స్పష్టంచేశారు. ఇకనుంచి తనతో పోటీ పడాలని రాజగోపాల్‌రెడ్డికి సవాల్ విసిరారు. మూడున్నరేండ్లలో ఆయన అభివృద్ధి చేయలేక చేతులెత్తేశారని, తాను ఆగిపోయిన పనులన్నింటినీ ముందుకుతీసుకెళ్తానని పేర్కొన్నారు. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజల కాళ్లు కడుగుతానని తెలిపారు. సంతలో పశువులను కొన్నట్టుగా రాజగోపాల్‌రెడ్డి నాయకులను కొనుగోలు చేసినప్పటికీ ప్రజలు తన వెంటే నడిచారని ఎమ్మెల్యే కూసుకుంట్ల పేర్కొన్నారు.
సోమవారం చండూరులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో హాజరైన టీఆర్ఎస్ శ్రేణులు