KTR | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులను దగా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. అబద్ధాలు, అభూతకల్పనలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి, ఎనిమిది నెలలుగా ఊరించి మూడు విడతలుగా మోసం చేసిన వైనాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వారికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. మూడు దశల్లో కనీసం 40 శాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండానే వందశాతం పూర్తయిందని ప్రకటించడం అబద్ధమని మండిపడ్డారు.
రుణమాఫీ పేరిట తెలంగాణలో నయవంచన జరిగిందని ఆధారాలను లేఖలో పొందుపర్చారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల దగాపడ్డ లక్షలాది మంది రైతుల తరఫున లేఖ రాస్తున్నానని వివరించా రు. ప్రభుత్వం వైఫల్యాలను కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసంతో లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పారు. రైతు రుణమా ఫీ విషయంలో వరంగల్ రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రాణప్రతిష్ఠగా స్వీకరించి, దాని అమలును ఏ స్థాయి లో పాతరేసిందో లేఖలో వివరించారు.
రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసంపై లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నరు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మోసం చేసిన ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నరు. దగాపడ్డ రైతుల తరఫున నేను ఈ లేఖ రాస్తున్నా..
-కేటీఆర్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్ష రుణమాఫీ చేస్తేనే రూ.17 వేల కోట్లు ఖర్చయిందని, 36 లక్షల మంది రైతులు రుణవిముక్తులయ్యారని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ చెబుతున్నట్టు 2 లక్షల రుణమాఫీ పూర్తయితే లబ్ధిదారుల సంఖ్య, రుణమా ఫీ మొత్తం రెట్టింపు కావాలని, కేవలం రూ.17,900కోట్లతో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామనడం ముఖ్యమంత్రి డొల్లవాదనకు నిదర్శనమని అభివర్ణించారు. 47 లక్షల మంది రైతులకు రు ణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి నామమాత్రంగా చేయడం కాంగ్రెస్ సరారు అసమర్థతకు నిలువుటద్దమని నిప్పులు చెరిగారు. లక్ష రుణమాఫీ కన్నా 2 లక్షల రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గడం మాఫీ విఫలమైందనేందుకు సంకేతమని చెప్పారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూ. 2 లక్షల రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిందని గతంలో రేవంత్‌రెడ్డి స్వయంగా రుణమాఫీకి రూ.40 వేల కోట్ల వరకు అవసరమవుతాయని పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ ఉదహరించారు.
‘కడుపు కట్టుకుంటే ఇది పెద్ద విషయం కాదు’ అని ఇంటర్వ్యూల్లో రేవంత్‌రెడ్డి చెప్పిన గొప్పలను ఏకరువు పెట్టారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీని రూ.31 వేల కోట్లకు కుదించారని, చివరికి అందులోనూ కోత పెట్టి బడ్జెట్లో రూ.26 వేల కోట్లే కేటాయించారని వివరించారు. మూడు విడతల రుణమాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో సరిపెట్టారని విమర్శించారు. రూ. 49,500 కోట్లని చెప్పి మూడింతలు తగ్గి రూ. 17,933కోట్లతో చివరికి 40 శాతం కూడా రుణమాఫీ చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి లక్షలాది మంది రైతులను ముంచారని మండిపడ్డారు. కడుపుమండిన రైతుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
మూడు దశల్లో కనీసం 40 శాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండానే 100శాతం పూర్తయిందని ప్రకటించడం వందశాతం అబద్ధం. రుణమాఫీ పేరిట తెలంగాణలో నయవంచన జరిగింది.
-కేటీఆర్
కాంగ్రెస్ చేసిన మోసానికి రైతాంగం ఆందోళన బాటను ఎంచుకున్నదని కేటీఆర్ ఉదహరించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో రుణమాఫీ కాని అన్నదాతలు రోడ్డెక్కారని, మంచిర్యాలలో రుణమాఫీ కాలేదన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. కరీంనగర్ రాజీవ్ రహదారిపై అన్నదాతలు రాస్తారోకో చేసి ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారని వివరించారు. మొలంగూరు ఇండియన్ బ్యాంకు ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారని, రుణమాఫీ కాని రైతులు వనపర్తిలో రైతువేదిక సాక్షిగా ‘అబద్ధాల ముఖ్యమంత్రికి పాలించే హకు లేదు’ అని నిప్పులు చెరుగుతున్న వైనాన్ని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. జగిత్యాల సహా రాష్ట్రమంతా రైతన్నల నిరసనతో అట్టుడుకుతున్నదని ఉదహరించారు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మోసం చేసిన ముఖ్యమంత్రి తీరుపై రైతులోకం ఆగ్రహంతో ఊగిపోతున్నదని చెప్పారు.
అప్పుల బాధ భరించలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అడ్డగోలు ఆంక్షలు, అర్థంలేని షరతులతో రుణమాఫీని రేవంత్ సర్కార్ ప్రహసనంగా మార్చిందని మండిపడ్డారు. రుణమాఫీని రైతులందరికీ వర్తింపజేయాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నదని చెప్పారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయంంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్‌కు కేవలం వారం వ్యవధిలోనే 1,20,000కు పైగా ఫిర్యాదులు అం దిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ సరారు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
అబద్ధాలు, అభూతకల్పనలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులను నిలువునా మోసం చేశారు. ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఊదరగొట్టి.. ఎనిమిది నెలలుగా ఊరించి మూడు విడతలుగా రైతులను దగా చేశారు.
-కేటీఆర్