KTR | హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రక్షణ కవచంలా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. రూ. 15 వేలు రైతు భరోసా, రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మాయ మాటలు చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతుంది. రోజుకు ఒకరి చొప్పున 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదు. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం అని కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. కానీ మళ్లా ఆత్మహత్యలు మొదలయ్యాయి. మరి కాలం తెచ్చిన కరువా..? కాంగ్రెస్ తెచ్చిన కరువా..? అర్థం చేసుకోవాలి. కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్ చేయడం లేదు. శివుడు గంగను కిందకు తీసుకువస్తే.. కేసీఆర్ గంగను పైకి తెచ్చిండు. కానీ రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టారు అని కేటీఆర్ తెలిపారు.
కాళేశ్వరంలో ఒక బ్యారేజ్‌లో ఒక పర్రె వడితే.. దానికి కాంగ్రెస్ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా లొల్లి పెట్టిండ్రు. మరి ఇవాళ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్, బీజేపోడు నోరెత్తడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు. ఖమ్మం వద్ద పెద్దవాగు కొట్టుకుపోతే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ ఉంది. కాళేశ్వరంలో ఒక పిల్లర్‌కు పర్రె వడితే.. ఎన్డీఎస్ఏ వాలిపోయింది. మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నెల్ కూలి దాదాపు 72 గంటలు అవుతుంది మరి ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు. ఏ బీజేపోడు మాట్లాడడు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడం లేదు. ఏం ఇబ్బంది వచ్చింది. సుంకిశాల కూలిపోతే గవినోళ్ల శ్రీనివాస్ ఆర్టీఐ కింద రఖాస్తు పెట్టుకుంటే.. ఇది దేశ భధ్రతకు సంబంధించిన అంశం.. సమాధానం ఇవ్వమని చెప్పారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ రెండే కాదు.. ఎన్నికల ప్రచారంలో మోదీ వచ్చి.. కాంగ్రెస్ పార్టీ అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతుంది.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని గర్జించిండు. కానీ ఇంత వరకు చర్య లేదు. రేవంత్ రెడ్డి బామ్మర్ది కంపెనీ శోధా 2 కోట్ల లాభం ఆర్జించింది. అమృత్ స్కీంలో రూ. 1137 కోట్ల కాంటాక్ట్ ఇచ్చిండు బామ్మర్ది కంపెనీకి రేవంత్ రెడ్డి. దీని మీద విచారణ చేయాలని సంబంధిత కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశాం. ఆరు నెలలు అవుతంది.. ఇప్పటి వరకు స్పందన లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ రైడ్ అయింది.. ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పడం లేదు. ఇవన్నీ దేనికి సంకేతం.. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ మీద పల్తెత్తు మాట మాట్లాడం లేదు. కేసీఆర్ మీదనే మాట్లాడుతున్నడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ ఆటలు సాగవని తెలుసు కాబట్టి.. ఆ ఇద్దరు కలిసి కేసీఆర్ పార్టీని ఖతం చేయాలన్నదే ఆలోచన. అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్కై సక్సెస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఎండాకాలం రాకముందే హైదరాబాద్‌లో నీటి ఎద్దడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్