రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరల ఉత్పత్తి యథావిధిగా కొనసాగేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ వస్త్ర ఉత్పత్తిదారులకు హామీఇచ్చారు. ‘ఆగం కాకండి.. అండగా నేనున్నా’నంటూ యజమానులకు భరోసా కల్పించారు. పెండింగ్‌లో ఉన్న బతుకమ్మ చీరల డబ్బులు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరెడ్డి, ముస్తాబాద్‌లోని నల్ల నర్సయ్య నివాసంలో శుభకార్యానికి హాజరయ్యారు. ముస్తాబాద్‌లో యూత్ నాయకుడు రాచమడుగు సంతోష్‌రావును కేటీఆర్ పరామర్శించారు. సంతోష్‌రావు తండ్రి కిషన్‌రావు ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి సిరిసిల్ల పట్టణానికి చేరుకొని బీవై నగర్‌లోని కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్, తవుటు కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని వస్త్ర ఉత్పత్తి దారులతో సమావేశమయ్యారు. మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని, అందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని భరోసా కల్పించారు. కార్మికులు, వస్త్ర పరిశ్రమ, అపారెల్, టెక్స్టైల్ పార్కుల అభివృద్ధిపై సుదీర్ఘంగా వారితో చర్చించారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాలను యథాతథంగా ఉంచాలని గ్రామస్థులంతా కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని పునరుద్ఘాటించారు. విలీన గ్రామాలన్నీ తిరిగి పంచాయతీలుగా మార్చేందుకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపించాలని చైర్పర్సన్ జిందం కళకు సూచించారు. సమావేశంలో టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
బాపు ఆరోగ్యం ఎట్లుందయ్యా..కేసీఆర్ గురించి వృద్ధురాలి ఆరా
గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఓ శుభకార్యానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు. మల్లవ్వ అనే వృద్ధురాలు కేటీఆర్‌ను ఆపాయ్యంగా పలుకరించింది. బాపు (కేసీఆర్ సారు) ఆరోగ్యం ఎట్లుందయ్యా? అని కేటీఆర్‌ను అడిగింది. మరో నాలుగు వారాలు అయితే పూర్తిగా కోలుకొని మన మధ్యకు వస్తారని కేటీఆర్ బదులిచ్చారు. దీంతో మల్లవ్వ తృప్తిపడుతూ, త్వరగా మంచిగా అయితే చాలు.. అంటూ కేటీఆర్‌కు చేతులు జోడించి దండంపెట్టింది.