బెంగళూరు: చెత్తతో నిండిన ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని అధికారులు నోటీస్ జారీ చేశారు. దీంతో ఒక స్థలం యజమాని క్లీనింగ్ చేపట్టారు. కొందరు వ్యక్తులు శుభ్రం చేస్తుండగా ఒక మహిళ మృతదేహం బయటపడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడైన ఆమె భర్తను అరెస్ట్ చేశారు. (Woman’s Murder) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. నగరంలోని ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంపిగెహళ్లి ప్రాంతంలో 15 ఏళ్ల కిందట స్థలం కొనుగోలు చేసిన యజమాని అందులోని చెత్తను క్లీనింగ్ చేసే పనిని కొంతమంది వ్యక్తులకు అప్పగించాడు.
కాగా, సెప్టెంబర్ 2న క్లీనింగ్ సిబ్బంది ఆ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా బెడ్‌షీట్‌లో చుట్టి ఉన్న కుళ్లిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు. షాకైన ఆ వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మహిళ శరీరంలోని కొన్ని భాగాలను కుక్కలు తినేసినట్లు గ్రహించారు. ఆమె దుస్తులపై ఉన్న ట్యాగ్ ఆధారంగా ఒక మాల్లో కొనుగోలు చేసినట్లు గ్రహించి అక్కడ ఆరా తీశారు. దీంతో మృతురాలిని 28 ఏళ్ల అనసూయ బెహెరాగా పోలీసులు గుర్తించారు. హోటల్లో పని చేసే ఆమె భర్త అయిన బీహార్‌కు చెందిన 32 ఏళ్ల సాగర్ చంద్ర రావత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ మహిళ హత్య మిస్టరీ వీడింది.
ఒడిశాకు చెందిన అనసూయ, బీహార్‌కు చెందిన రావత్ కొన్నేళ్ల కిందట పనుల కోసం బెంగళూరు వచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుని కలిసి జీవిస్తున్నట్లు చెప్పారు. భార్యాభర్తలైన వారిద్దరూ కొన్ని నెలలు కలిసి పలు హోటల్స్‌లో పనిచేసినట్లు వివరించారు. ఆ తర్వాత రావత్ ఒక హోటల్లో పనిచేస్తుండగా, అనసూయ ఒక క్లాతింగ్ స్టోర్‌లో ఉద్యోగం చేసిందన్నారు.
అయితే భార్యాభర్తలైన అనసూయ, రావత్ ఆర్థిక విషయాలపై తరచుగా గొడవపడేవారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 11న ఒక గొడవ తర్వాత రావత్ తన భార్య అనసూయ గొంతునొక్కి హత్య చేశాడు. మూడు రోజుల పాటు ఆమె మృతదేహంతో ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక దుప్పటిలో చుట్టి సంపిగెహళ్లి ప్రాంతంలోని ఖాళీ స్థలంలో పడేశాడు.
కాగా, భార్య మృతదేహాన్ని ఎవరైనా కనుగొన్నారేమోనని తెలుసుకునేందుకు రావత్ చాలా రోజుల పాటు ఆ ప్రాంతానికి వచ్చినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అనసూయ హత్య జరిగిన 20 రోజుల తర్వాత సెప్టెంబర్ 2న ఆ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా కుళ్లిపోయిన ఆమె మృతదేహాన్ని క్లీనింగ్ సిబ్బంది కనుగొన్నట్లు చెప్పారు. భార్య హత్య తర్వాత కూడా రావత్ యధావిధిగా హోటల్లో పనికి హాజరయ్యాడని వివరించారు. హోటల్లో విచారణ జరిపినప్పుడు ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతునట్లు తెలిసిందన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.