ఐహెచ్పీ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డంపెట్టుకుని రేవంత్‌రెడ్డి, సృజన్‌రెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. 2 కోట్ల సృజన్‌రెడ్డి కంపెనీ రూ. 1000 కోట్ల పనులు, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్పీ రూ. 200 కోట్ల పనులు చేయడం ఏంటి?బావమరిది కండ్లలో సంతోషం నింపడం కోసమే రేవంత్ రాష్ర్టాన్ని దోచుకుంటున్నారు. తన ఇంట్లో లంకెబిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లకు తెరలేపారు.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది కంపెనీకి అర్హతలేకపోయినా వేయి కోట్ల పనులను అప్పగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ జరిపించి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు టెండర్లు దక్కేలా చేసిన రేవంత్‌రెడ్డి.. ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం ప్రకారం పదవి కొల్పోతారని పేర్కొన్నారు.
శనివారం తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అమృత్ టెండర్లపై కేంద్రం విచారణ చేయకుంటే బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు అయినట్టే అనుకోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు సైతం రేవంత్‌రెడ్డిని పొగడటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని అన్నారు.
రేవంత్ తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తూ అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని, త్వరలోనే వరుసగా వాటిని బయటపెడతానని చెప్పారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే భారీ కుంభకోణానికి రేవంత్ పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
తెలంగాణలోని వివిధ పట్టణాల్లోని మంచినీటి సరఫరా కోసం అమృత్ పథకం కింద టెండర్లు పిలిచారని, సీఎంగా, మున్సిపల్ వ్యవహరాలశాఖ కూడా చూస్తున్న రేవంత్‌రెడ్డి ఈ కుంభకోణం చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అమృత్ టెండర్లు ఇస్తే.. ప్రజలకు మాత్రం విషం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. దీనిపై కేందమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు లేఖ రాసినట్టు తెలిపారు.
పేరొకరిది.. పనులు మరొకరికి
సీఎం బావమరిది సూదిని సృజన్‌రెడ్డి కంపెనీ శోధ కన్స్ట్రక్షన్స్కు అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయల పనులు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. టెండర్లలో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, సంపత్తి కానీ దానికి లేవని తెలిపారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని, ఇండియన్ హ్యూమ్ పైప్ (ఐహెచ్పీ) అనే కంపెనీని పిలిపించి, బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్‌రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారని పేర్కొన్నారు.
అందులో భాగంగానే జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారని ఆరోపించారు. రూ.1137 కోట్ల కాంట్రాక్టు దక్కిందని చెప్తూ ఎన్ఎస్ఈ, బీఎస్ఈకి ఐహెచ్పీ లేఖ రాసిందని వివరించారు. 20 శాతం పనిని తాము చేస్తున్నామని, ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ మాత్రం 80 శాతం అంటే దాదాపు వెయ్యి కోట్ల పనిచేస్తుందని లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కంపెనీని శిఖండి సంస్థగా అడ్డంపెట్టుకుని రేవంత్‌రెడ్డి, సృజన్‌రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని విమర్శించారు. రూ. 2 కోట్ల సృజన్‌రెడ్డి కంపెనీ రూ. 1000 కోట్ల పనులు, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్పీ రూ. 200 కోట్ల పనులు చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పదవి పోతది
ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 1988 లో సెక్షన్ 7, 11, 13 నిబంధనల ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి విచారణ ఎదురోవాల్సి వస్తుందని, ఆయన సీఎం పదవి కొల్పోతారని కేటీఆర్ తెలిపారు. తన కుటుంబ సభ్యులకు లబ్ధిచేకూరిస్తే, ఆశ్రిత పక్షపాతం చూపిస్తే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులని తెలిపారు. గతంలో ఇవే చట్టాల కింద సోనియాగాంధీ 2006లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ పదవిని కోల్పోయారని గుర్తుచేశారు.
అక్రమ మైనింగ్ అనుమతుల నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, ఆదర్శ్ కుంభకోణంలో 2011లో మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి కోల్పోయారని గుర్తు చేశారు. బావమరిది కండ్లలో సంతోషం కోసం రేవంత్ రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని పేర్కొన్నారు. తన ఇంట్లో లంకెబిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లకు తెరలేపారని ఆరోపించారు. అమృత్ టెండర్ల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
మరిన్ని కుంభకోణాలు
రేవంత్‌రెడ్డి కుంభకోణాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందు ఉంచుతానని కేటీఆర్ తెలిపారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్త్ సిటీ కుంభకోణాలను బయటపెడతానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తొలుత దీనిపై మాట్లాడారని, ఆ తర్వాత కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో దీనిపై మాట్లాడడం మానేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రేమకథ నడుస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినా, ఇక్కడ మాత్రం చర్యలు ఉండవని పేర్కొన్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రేవంత్‌రెడ్డి పదవి ఉండదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
బీజేపీ- కాంగ్రెస్ కుమ్మక్కు కాకుంటే
కేంద్ర ప్రభుత్వంలో రాష్ర్టానికి చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ఉన్నారని, రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకుంటే టెండర్ల ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వారు మౌనంగా ఉన్నా, విచారణకు ఆదేశించకున్నా రేవంత్‌రెడ్డికి, వారికి మధ్య పూర్తిస్థాయి అవగాహన ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు.