హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నదంతా తప్పుడు ప్రచారమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గతంలో అమెరికా, దావోస్ పర్యటనల సందర్భంగా పెట్టుబడులు వస్తున్నాయంటూ ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సింగపూర్‌కు నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలతోనే రేవంత్ మళ్లీ ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా గుర్తింపు కోసమే రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విలేకరులతో మాట్లాడారు.
గతంలో దావోస్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.40, 232 కోట్ల పెట్టుబడులు సాధించామని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. వాస్తవానికి తీసుకొచ్చింది కేవలం రూ.862 కోట్లు మాత్రమేనని తెలిపారు. దేవుళ్లపై ఓట్లు పెట్టి రుణమాఫీ చేస్తానంటూ రైతులను నిండా ముంచిన ఘనుడు రేవంత్ అని విరుచుకుపడ్డారు. పెట్టుబడులపైనా ఫేక్ ప్రచారంతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానంటూ రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నంలో తెలంగాణకు తీవ్ర నష్టంచేస్తున్నారని ఆక్షేపించారు.
బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన ఫార్మాసిటీ, ఫార్ములా-ఈ రేస్, ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని వివేకానంద నిప్పులు చెరిగారు. రాష్టంలో శాంతిభద్రతలు క్షీణించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పెట్టుబడుదారులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణను క్యాన్సర్ పేషెంట్‌తో పోల్చి అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులను బెదిరించారని ఆరోపించారు.
గత దావోస్ పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి కట్టుకథలు చెప్పారని వివేకానంద విరుచుకుపడ్డారు. ఇందులో రూ.12,400 కోట్లు అదానీ కంపెనీలవేనని, ఇవి రావడం అనుమానమేనని చెప్పారు. గతంలో అదానీ గ్రూప్స్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తే ఆ సంస్థ అనైతిక విధానాలు నచ్చకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ కంపెనీకి రేవంత్ ఎర్రతివాచీ పర్చడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
అలాగే రూ.160 కోట్ల విలువైన షెల్ కంపెనీ గోడి రూ.8వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందని ప్రభుత్వం చెప్తుంటే నమ్మశక్యంగా లేదని తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ ప్రకటించిన రూ.9000 కోట్లు, వెబ్‌వర్క్స్ ప్రకటించిన రూ.5200 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని వివరించారు. గోద్రెజ్ కంపెనీ రూ.1270 కోట్ల పెట్టుబడిలో రూ.300 కోట్లకు నిరుడు ఒప్పందం కుదిరిందని చెప్పారు.
అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు చెప్తున్న రూ.40,232 కోట్ల పెట్టుబడు జాబితాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రూ.14,500 కోట్లకు ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. మొత్తంగా మిగిలేది రూ.5,332 కోట్లు మాత్రమేనని తెలియజేశారు. హైదరాబాద్‌లో కార్యాకలాపాలు నిర్వహిస్తున్న అరగెన్ లైఫ్ సెన్సెస్ రూ.2000 కోట్లు పెట్టుబడి పోనూ నికరంగా మిగిలింది రూ.3,332 కోట్లు మాత్రమేనని చెప్పారు. టాటా గ్రూప్‌కు సంబంధించిన రూ.1500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక రూ.1832 కోట్లు మాత్రమే మిగిలిన పెట్టుబడులని వివేకానంద చెప్పారు.
గతంలోనే రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన గోద్రెజ్ రూ.1270 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించిందని వివేకానంద గుర్తుచేశారు. ఇందులో నుంచి రూ. 300 కోట్లు తీసేస్తే రూ.970 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్స్- సర్జికల్ ఇన్స్ట్రూమెంట్కు చెందిన రూ.231.5 కోట్లు మాత్రమేనని, మిగిలిన రూ.630.5 కోట్ల పెట్టుబడుల వివరాలు తెలియాల్సి ఉన్నదని వివేకానంద చెప్పారు.
ఇక బీఎల్ ఆగ్రో, ఇన్నోవేరా, క్యూసెంట్రీయో, సిస్ట్రా, ఊబర్, వో9 సొల్యూషన్స్ వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించినా వివరాలు ప్రకటించలేదని ధ్వజమెత్తారు. మొత్తంగా నిరుడు సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన వల్ల నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.862 కోట్లు మాత్రమేని పునరుద్ఘాటించారు. కానీ ఫేక్ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.