హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రజల పాలిట శాపంగా మారాయని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ విధానం నిర్మించడం. రేవంత్‌రెడ్డి విధానం కూలగొట్టడం. హైడ్రా మొదలు మూసీ, మెట్రో, హిల్ట్ పాలసీ వరకు రేవంత్‌రెడ్డి తీసుకున్నవన్నీ తుగ్లక్ నిర్ణయాలే’ అని పేర్కొన్నారు. మెట్రో విషయంలో ఎల్ అండ్ టీ సంస్థతో కుదుర్చుకున్న అనాలోచిత ఒప్పందాల వల్ల ప్రతిరోజూ రెండున్నర కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడుతున్నదని వివేకానంద పేరొన్నారు. మెట్రోపై చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ మెట్రోను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ‘కోటీ 30 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి మెట్రో ఫేజ్-2 ఎందుకు ఇవ్వడం లేదు? 40 లక్షల జనాభా ఉన్న జైపూర్‌లో మెట్రో ఫేజ్-2కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీనిపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నోరు విప్పాలి’ అని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’
ఢిల్లీకి కప్పం కట్టేందుకు రేవంత్‌రెడ్డి నెలకోసారి ఢిల్లీకి వెళ్లినా ఈ లెక్కన 31 సార్లు వెళ్లాలని, కానీ 73సార్లు ఎందుకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాలని వివేకానంద డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’ అని అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానం మీటింగ్‌లో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయని, ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసి వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో జీవో ఏపీ అని రావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకన్నా దికుమాలిన తనం మరొకటి ఉండదని, అసలు సంబంధిత మంత్రులు, పంచాయతీ రాజ్ శాఖ ఏం చేస్తున్నాయని వివేకానంద ప్రశ్నించారు. సీఎం టూరిజంపై రివ్యూలు చేస్తుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కాళేశ్వరం మెయింటెనెన్స్ మీకు చేతకాకపోతే మాకు అప్పగించండి. మేము చేసి చూపిస్తాం. కేసీఆర్ 4 ఏండ్లలో కాళేశ్వరం పూర్తి చేస్తే మీకు మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయడానికి 39 నెలలు పడుతుందా? కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు మేము వస్తాం. కాంగ్రెస్ నేతలూ రావాలి. నీళ్లను లిఫ్ట్ చేసి రైతులకు ఇద్దాం. ఒకవేళ మీరు చెప్పినట్టు డ్యామ్ కొట్టుకుపోతే మనమే ముందు కొట్టుకుపోదాం’ అని పేర్కొన్నారు. కేసీఆర్ ఆర్థిక విధానాల వల్లే తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని చెప్పారు.