హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మరోజన్మ ఎత్తినా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను టచ్ కూడా చేయలేవు.. ఏంచేసినా సరే.. కేసీఆర్, కేటీఆర్ క్యారెక్టర్‌ను దెబ్బతీయలేవు.. అని సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. అబద్ధపు పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక వాటి ని తుంగలో తొక్కిన సీఎంగా రేవంత్‌రెడ్డి మిగులుతారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్‌లో దుబారా ఖర్చులు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. భారత్ సమ్మిట్ సమావేశానికి చేసిన ఖర్చు దాదాపు రూ.200 కోట్లు దాటిందని, ఈ సొమ్మంతా ప్రభుత్వానిదేనని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు వల్ల ప్రజాధనం వృధా చేయడం కాదా? అని నిలదీశారు. కంచె గచ్చిబౌలి భూములను తాకట్టుపెట్టి రూ.170 కోట్ల లంచం ఇచ్చి.. రూ.10,000 కోట్ల అప్పు తెచ్చారని ఆరోపించారు. మరి లంచంగా ఇచ్చిన రూ.170 కోట్లు దుబారా కాదా? అని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.