హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రివా ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే పీ వివేకానంద బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్నా.. సీఎం రేవంత్‌రెడ్డికి కోవర్టుగా పని చేస్తున్నావని ఆరోపించారు. ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఉత్తరాల రాసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్పార్టీ లేకుండా చేయాలన్న కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్న ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నుంచి వారి మైత్రిబంధాన్ని బలోపేతం చేసుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేను పొగిడారని, రేవంత్‌రెడ్డి కూడా ఏబీవీపీ నుంచి వచ్చినవాడేనని తెలిపారు. ఢిల్లీలో కుస్తీ చేసుకుంటూ, గల్లీలో దోస్తీ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్, కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అరెస్ట్ చేయాలి? అనడంపై మండిపడ్డారు. కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయాలి? హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకా? లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ర్టానికి తెచ్చినందుకా? 25 లక్షల ఉద్యోగాలను అందించినందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
జాతీయ పార్టీల కక్షపూరిత రాజకీయాలను గమనిస్తున్నామని, ఇలాంటి కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో పెద్ద పెద్ద నాయకులను ఎదుర్కొన్నామని, ఈ నాయకులంతా కేసీఆర్ కాలిగోటికి సరిపోరని విమర్శించారు. ఢిల్లీకి కప్పం కట్టే రాష్ట్ర నాయకత్వంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని కుంభకోణాలేనని, ఒక వైపు లిక్కర్ మాఫియా, మరో వైపు ఇసుక దందా, 7+1 శాతం అక్రమ వసూళ్లు ఉన్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నారని.. పల్లెలు పడకేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రులు.. షాడో మంత్రుల ఆధ్వర్యంలో పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గాడి తప్పాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మండిపడ్డారు. ఓల్డ్‌సిటీలో రోజుకో హత్య జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో పాలన లేకపోవడం వల్ల చెత్తాచెదారం, మట్టికుప్పలు పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. దోమల వ్యాప్తి పెరిగిపోతుండడంతో, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వాటిని నియంత్రించే అధికారులు లేకపోవడం బాధాకరమని వాపోయారు.
గ్రూప్-1, గ్రూప్-2 నిరుద్యోగులు బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. కరెంటు కోతలు పెరిగాయని అన్నారు. నగరంలో ఎక్కడ చూసినా వీధికుక్కల స్వైరవిహారం వల్ల మరణాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా పడకేసిందని, అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అని ఎమ్మెల్యే ఆగ్రహించారు.