MLA KP Vivekanand | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేటీఆర్ భాష గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భాష మార్చుకోవాలని చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ తన భాషను మార్చుకోవడం లేదని, అభ్యంతరకర పదాలు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎంగా ఉండి కూడా రేవంత్ దిగజారుడు భాష మాట్లాడుతున్నారని, తొలుత ఆయన మారితే అందరూ మారే అవకాశం ఉంటుందని అన్నారు.
అవసరం అనుకుంటే సీఎంకు భట్టి శిక్షణ తరగతులు కూడా పెట్టించవచ్చని, లేదంటే ఏఐసీసీ నేతల నుంచి అయినా శిక్షణ ఇప్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు గురించి తుక్కుగూడ బహిరంగ సభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతు భరోసా గురించి సమాధానం చెప్పాలని నిలదీశారు. హామీలు అమలుచేయలేక అప్పులంటూ ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు లేకే తమ పార్టీ నుంచి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారని తెలిసి సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.