హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి మూడు కార్పొరేషన్లుగా చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపా రు. సీఎం రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యం, అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా) పేరుతో ఔటర్ రింగ్ రోడ్డులోని అన్ని మున్సిపాలిటీలను, చెరువులను, భూములను, ఆస్తులను కాపాడుతామని రెండు రోజులుగా వస్తు న్న వార్తలు స్థానిక సంస్థలకు వ్యతిరేకమని తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాలన్నీ స్థానిక సంస్థలను బలోపేతం చేయకపోగా, నిర్వీర్యం చేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీతోపాటు శివారు ప్రాంతాల్లోని ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేనందునే హైడ్రా పేరుతో స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులకు, ప్రజలకు భాగస్వామ్యం లేకుండా పెత్తనం చేయాలనే కాం గ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వివేకానంద స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అయిన తర్వాత జోన్లు, సర్కిళ్లు పెంచి డిప్యూటీ కమిషనర్లకు అధికారాలు ఇచ్చి హైదరాబాద్ మహానగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఫలితంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందని వివరించా రు. ఏడు నెలలుగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పనులు ఎక్కడికకడే నిలిచిపోయాయని, హైదరాబాద్ బ్రాండ్ రోజురోజుకు దిగజారి పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్టీ మార్పు దుష్ప్రచారమే
కేసీఆర్ నాయకత్వంలో తనకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. పార్టీ మార్పుపై తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ మారిన కడియం శ్రీహరి అనర్హత అంశంపై పిటిషనర్‌గా తానేనని వివేకానంద గుర్తు చేశారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని, రేవంత్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇస్తారో ఇయ్యరో అనే అనుమానం ఉందని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ త్వరలో అనర్హతకు గురవుతారని స్పష్టం చేశారు. ఉపఎన్నికలు వస్తాయని, బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.