కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘డీజిల్ లేదు.. ప్రైవేట్ అం బులెన్స్లో తీసుకెళ్లండి’ అంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది ఓ గర్భిణి బంధువులకు ఉచిత సలహా ఇచ్చారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాస్పిటల్‌కు వెళ్లి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాలిలా.. ఆసిఫాబాద్ మండలం బలన్పూర్కు చెందిన ఆదివాసీ గర్భిణి గెడాం రజిత.. కుటుంబ కలహాలతో గురువారం రాత్రి విషం తాగింది. అదే రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యసిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేశారు.
తమ వద్ద డబ్బులు లేవని.. 108 అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని రజిత బంధువుల కోరగా, అంబులెన్స్‌లో డీజిల్ లేదని, ప్రైవేట్ అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో గర్భిణి బంధువులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేయగా, స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యే వెంటనే హాస్పిటల్‌కు చేరుకొని సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే ఫోన్‌చేసినా స్పందించకపోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని నిలదీశారు. సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే స్వయంగా డీజిల్‌కు డబ్బులు ఇవ్వడంతో అప్పటికప్పుడు 108 అబులెన్స్ను ఏర్పాటు చేసి మంచిర్యాల హాస్పిటల్‌కు రజితను తరలించారు.