హైదరాబాద్/ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఆగస్టు 14: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్లదని ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్ నవంబర్ 21, 2024లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం దానిని కొట్టివేసింది. జనవరి 6, 2024లో ఇదే అంశంపై శ్యాంనాయక్ హైకోర్టును ఆశ్రయించగా అదే ఏడాది అక్టోబర్ 25 కోవ లక్ష్మికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు తీర్పుపై కోవ లక్ష్మి స్పందించారు. అంతిమంగా న్యాయమే గెలిచిందని హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రజల విజయమని తెలిపారు. విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు.