ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఆసిఫాబాద్ టౌన్, జనవరి 22: ‘కలెక్టరేట్ కార్యాలయం ప్రజల కోసమా.. పోలీసుల కోసమా ?’ అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ప్రజా సమస్యలు కలెక్టర్‌ను కలిసి చెప్పుకోవడానికి వస్తే అడ్డుకోవడం ఏమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లొద్దిగూడ, కీమానాయక్ తండా, చిన్న దాంపూర్ గ్రామ పంచాయతీలకు రోడ్డు సౌకర్యం, రైతుల భూములను ధరణిలో నమోదు చేయడం కోసం ఆయా గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్‌కు రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రజలతో కలిసి గేటు వద్దే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేనని చూడకుండా అడ్డుకొని పోలీసులు అగౌరవపరిచారని అసహనం వ్యక్తంచేశారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర రావు వచ్చి సముదాయించినా వినలేదు. దీంతో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.