హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ గౌరవించి వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పీకర్‌కు సూచించిందని చెప్పారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరించవద్దని అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి మద్దతు పలికిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని గుర్తుచేశారు. వారిని పెన్షన్‌కు కూడా అనర్హులుగా చేశారని చెప్పారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు కాంగ్రెస్ నానా పాట్లు పడుతున్నదని అన్నారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీలా కాకుండా ఉప ప్రాంతీయ పార్టీలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్‌గాంధీ తెలంగాణ ఫిరాయింపులపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి క్యారెక్టర్ లేదని, రాహుల్‌గాంధీ అయినా తాను ఫిరాయింపులపై చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్ఠం చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. దానం నాగేందర్‌ను హైదరాబాద్ రోడ్లపై తామే ఉరికిస్తామని, రేవంత్‌రెడ్డి అవినీతి సొమ్ముతో పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలా వంద కోట్లు ఇచ్చి కొన్నాడని ఆరోపించారు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ సాధించిన తొలి విజయమని అన్నారు. మళ్లీ కోర్టు జోక్యం చేసుకోకముందే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటువేయాలని కోరారు. స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని, సీఎం ఆయనపై ఏ ఒత్తిడీ తేవొద్దని అన్నారు. స్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సూచించారు. హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైందని, ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని స్వాగతించాలని కోరారు. హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పందించాలని అన్నారు.