హైదరాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) స్ఫూర్తితో ప్రజాపోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni )పిలుపు నిచ్చారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు, దేశ్‌ముఖ్‌లు, రజాకార్లను గడగడ లాడిరచిన ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాపోరాటాలను కొనసాగించాలన్నారు. బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మఖ్దూంభవన్‌లో ఐలమ్మ 39వ వర్ధంతి సభలో పాల్గొని ప్రసంగించారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తికోసం కుల, మతాలకు అతీతంగా ప్రజలు సాగించిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి హిందూ, ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్ని స్తున్నదని విమర్శించారు. నిజాం ప్రభువు హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు, దొరలు, జాగిరిదార్లు, పేదలు, బడుగుబలహీనవర్గాలపై దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించి ప్రజలను ఘోసపెట్టారని ఈ పరిస్థితులలో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను, దౌర్జన్యాలను ఎదురించిన వీరనారి కమ్యూనిస్టు ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిందన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి అధికారికంగా ఉత్సవాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాటి తరం ఐలమ్మ త్యాగాలు, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరాలకు తెలియజేయడానికి పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.