నల్లగొండ ప్రతినిధి, జూలై 23 (నమస్తే తెలంగాణ )/మునుగోడు: నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వ నిబంధనలే అడ్డంకిగా ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్న చిన్న కారణాలతో పేదలు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దూరమైనట్టు చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ తోపాటు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిబంధనలు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు చెప్పారు.
నిబంధనల్లో మార్పులు తెచ్చి అందరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. పథకాలు దళారులకు అందితే సహించకూడదని అన్నారు. ఇదే విషయమై రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఇందిర మ్మ ఇండ్లకు ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు సరిపోవడం లేదని తెలిపారు. కనీసం 7.50 లక్షలు ఇస్తే పేదలు అనుకున్నట్టు ఇండ్లు కట్టుకునే వీలు ఉంటుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సంబంధిత మంత్రి పొంగులేటికి అవగాహన లేదని అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసి ఉంటే పథకం నిబంధనలు మార్చి పథకం అందరికి అందేలా చేసేవారని పేర్కొన్నారు.
మంత్రి పదవి ముఖ్యం కాదు..
ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఉంటే తనకు మంత్రి పదవి వచ్చేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని మునుగోడు నియోజనవర్గ అభివృధ్ధే తన లక్ష్యమని అన్నారు. బుధవారం ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అప్పట్లోనే చెప్పారని గుర్తుచేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను కమ్యూనిస్టులే ఓడించారని అన్నారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్కు మద్దతు తెలపడం వల్లే తాను ఓడిపోయానని తెలిపారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఆయన ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతున్నారు.