హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసానికి జహీరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చేరుకున్నారు. సమావేశం అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన అరికెపూడి గాంధీ ఇంటికి బయలుదేరనున్నారు.
అంతకుముందు శంభీపూర్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే కేసీఆర్ను కలవాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కులమతాలు, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. పార్టీ కార్యకర్తలను అక్రమంగా నిర్భంధిస్తున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులను స్వేచ్ఛగా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఇంటికి తాము వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. కాగా, శంభీపూర్ రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటికి వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.