హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించానన్న అభియోగంతో 2023 నవంబర్ 29న కమలాపుర్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విజయయాత్రకు వస్తానని, లేకుంటే మీరే మా శవయాత్రకు రావాలని తాను ఓటర్లను బెదిరించినట్టు వీడియో ఉన్నదంటూ కమలాపురం ఎంపీడీవో జీ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. నిజానికి తాను ఎలాంటి నేరం చేయలేదని, అయినప్పటికీ రాజకీయ కక్షతో తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని హైకోర్టుకు విన్నవించారు.