నల్లగొండ : హక్కుల కోసం కొట్లాడే వారికి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నల్లగొండలోని సాగర్ రోడ్డులో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, రజక సంఘాల చీఫ్ అడ్వైజర్ కొండూరు సత్యనారాయణ, వివిధ కుల సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రజాకార్లు, దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత ఐలమ్మ అని ప్రశంసించారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపిన తెగువ మరువలేనిదన్నారు. ఆ మహనీయురాలి స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకన్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.