హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో అధికారపక్షం అడ్డగోలు భాషతో రాష్ట్రం పరువుతీస్తున్నదని, బూతులకు ప్రాధాన్యమిస్తూ ప్రజాసమస్యలను తప్పుదోవపట్టిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ మొదలుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సర్కార్ అవినీతిని ప్రశ్నించిన ప్రతిపక్షం గొంతునొక్కి బిల్లులు పాస్ చేసుకున్నారని వి మర్శించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. 4 వారాలపాటు నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను 10 రోజులకు కుదించడం దురదృష్టకరమన్నా రు. అధికారపక్ష సభ్యులు ప్రజాసమస్యలపై చర్చించకుండా కౌశిక్‌రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. మంత్రి పొంగులేటి మైనింగ్ అక్రమాలపై ప్ర శ్నిస్తే కడియం శ్రీహరిని అడ్డుపెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని దుయ్యబట్టారు. ‘కత్తుల కోలాటమాడుతా.. రా రా చూసుకుం దాం.. బొక్కలో వేసి తొక్కుతం..’ అంటూ సభ్యసమాజం సిగ్గుపడేలా మాట్లాడిన సభ్యులను వదిలిపెట్టి కడియంను ఏ పార్టీ అని అడిగిన కౌశిక్‌పై చర్యలు చేపట్టేందుకు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ‘శ్రీహరికి పార్టీ ఏం తక్కువ చేసింది? బీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించిన ఆయన కేసీఆర్‌ను దూషిస్తుంటే మాకు కోపం రాదా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.
తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యులు ప్రజాసమస్యలను విస్మరించి అనవసర విషయాలు మాట్లాడం బాధాకరమని, వారి తీరు ను ప్రజలు హర్షించబోరని సంజయ్ స్పష్టం చేశారు. అనేకసార్లు చట్టసభలకు ఎన్నికై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ అసభ్యంగా మాట్లాడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేశారని ప్రశ్నించారు. ‘హరీశ్‌రావును బాడీషేమింగ్ చేసిన విప్ ఆది శ్రీనివాస్ అంత అందంగా ఉన్నాడా? వేములవా డ ప్రజల సమస్యలు లేవనెత్తకుండా పెద్ద నేతలను దూషించడం సమంజసమేనా? మల్కపేట రిజర్వాయర్‌కు వచ్చిన కాళేశ్వరం జలాలను నెత్తిన జల్లుకున్న ఆయన హరీశ్‌రావుపై విమర్శలు చేయడమెందుకు? బీర్ల ఐలయ్య నియోజవర్గానికి కాళేశ్వరం నీళ్లు వచ్చింది వాస్తవం కాదా? నిజాలు, నీళ్లు కండ్లెదుట కనిపిస్తుంటే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తారా? ప్రతిపక్షంతో సమన్వయం చేయాల్సిన విప్‌లు అడ్డగోలుగా మాట్లాడుతారా? ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసిన హరీశ్‌రావు కుటుంబసభ్యులను వివాదంలోకి లాగుతారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అసెంబ్లీలో ప్రభుత్వ దుర్మార్గాలపై ప్రశ్నించడాన్ని ఓర్వలేకే తనపై చర్యల కోసం ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభలో అధికార కాంగ్రెస్ సభ్యులు తనను ఎలాంటి బూతులు తిట్టారో ప్రజలంతా చూశారని.. వారిపై ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదని స్పీకర్‌ను ప్రశ్నించారు. తమకో న్యాయం.. ముఖ్యమంత్రికి మరో న్యాయ మా? అని నిలదీశారు. పొంగులేటి అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన హరీశ్‌రావుపై ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ‘గతంలో హరీశ్‌రావు కోరిక మేరకే కాళేశ్వరం కమిషన్ ఏర్పా టు చేశామన్న రేవంత్.. అక్రమ మైనింగ్ అంశంలో హరీశ్‌రావు డిమాండ్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? హౌస్ కమిటీ వేయాలని అడిగితే సీఐడీతో విచారణ చేయిస్తామనడంలో ఆంతర్యమేంటి? తప్పించుకొనేందుకు కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వం తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడబోనని, ప్రజల తరఫున పోరాటాన్ని ఆపేదిలేదని కౌశిక్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే శాసనసభలో తన గొంతు నొక్కారని ఆరోపించారు. ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ నన్ను హైదరాబాద్‌లో తిరగనివ్వను అన్న డు. కడియం శ్రీహరి బీఆర్ఎస్, కేసీఆర్‌పై నోటికొచ్చినొట్టు మాట్లాడాడు. ఏపార్టీలో ఉన్నావని ఆయనను అడిగితే నాపై తుపాకీ ఎక్కుపెట్టాడు’ అని గుర్తుచేస్తూ.. తాటికొం డ రాజయ్యను కాదని శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ‘నేను క్రీడాకారుడిని, జాతీయ జెండా మోసిన వాడిని. అందుకే ఫిట్‌గా ఉన్నా. సీఎం ఫిట్‌గా లేకపోతే నేనేం చేయా లి’ అని వ్యాఖ్యానించారు. ‘దళితుల గురిం చి నేను మాట్లాడినంతగా మరెవరూ మాట్లాడలేదు. కాదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా’ అని సవాల్ విసిరారు. గతంలో దళితబంధు ఇవ్వాలని అడిగిన తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందేనని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.