పరిగి, జూలై 31: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె అనుకున్నట్టుగానే పాదయాత్ర చేపట్టారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. మీనాక్షి పాదయాత్ర తేదీలను కుదించడంతోపాటు పాదయాత్రపై మీనాక్షి మార్క్‌ను తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారన్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు. మీనాక్షి గెస్ట్రోల్కే పరిమితం అవుతుంది.. యాత్ర ఆసాంతం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ నేతృత్వంలో కొనసాగుతుందన్న భ్రమలను పటాపంచలు చేశారు.
తొలిరోజు యాత్ర ఆసాంతం మీనాక్షి నేతృత్వంలోనే కొనసాగింది. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రంగాపూర్ నుంచి సాయంత్రం 5:40 గంటలకు ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది. అదే జిల్లాలోని పరిగి పట్టణం వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు అంతా మీనాక్షి నటరాజన్ అడుగు జాడల్లోనే నడక సాగించారు. ఊరూరా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను కలిసేందుకు ఆసక్తిని చూపారు. ఆమెతో సమస్యలు చెప్పుకునేందుకే వేచి చూశారు. ఆమె కూడా తోటి నేతలు, కార్యకర్తల్లో హుషారు నింపుతూ యాత్ర సాగించారు.
ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్ పాదయాత్ర.. కాస్త ర్యాలీగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజా సమస్యలు పక్కకు తొలగాయని, నేతలకు శ్రమదానం చేసే ఓపికే లేకుండా పోయిందని, మొత్తంగా కాంగ్రెస్ ప్రజాహిత పాదయాత్ర ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండానే తొలిరోజు పూర్తయిందని పెదవి విరుస్తున్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ, వారికి మరింత భరోసా కల్పిస్తూ ముందుకు సాగడమే పాదయాత్ర ప్రధాన లక్ష్యం.
అలాంటిది రంగాపూర్ నుంచి పరిగి వరకు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర ర్యాలీగానే కొనసాగింది. ‘ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమేమీ కావాలి, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి’ అని నేతలు అడిగి తెలుసుకుంటారని ఈ ప్రాంతవాసులందరూ ఆశించారు. తీరా ఇలా వచ్చి, అలా వెళ్లిపోయారని పలువురు పెదవి విరిచారు. దారి పొడవునా ఏ ఒక్క సామాన్యుడినీ కలిసింది లేదు, మాట్లాడిందీ లేదు. కలిసేందుకు ప్రయత్నించిన వారిని సైతం పోలీసులు లాగి పక్కకు తోసేయడం విడ్డూరం.
స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రాతినిధ్య సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ షఫీ అహ్మద్‌ఖాన్, మరికొందరు దివ్యాంగులు సుమారు 2 గంటలపాటు రోడ్డుపక్కన వేచి ఉన్నారు. నేతలు రాగానే వినతిపత్రం ఇచ్చేందుకు ముందుకెళ్లగా, వారిని కలవనీయకపోవడంతో వారంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో వారంతా కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర వల్ల సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
పాదయాత్రలో తాండూరు, ఇబ్రహీంపట్నం, నారాయణపేట ఎమ్మెల్యేలు బయ్యని మనోహర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పర్ణికారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మధుయాష్కీ, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు నర్సింహారెడ్డి, హరివర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దారిపక్కనే ఉన్న మహానీయుల విగ్రహాలను కాంగ్రెస్ నేతలు మరిచారు. జాతీయ రహదారి పక్కనే గల ఇందిరాగాంధీ, అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు ఏ ఒక్క నేత కూడా పూలమాల వేయకపోవడం గమనార్హం. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అసలే పట్టించుకోలేదు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఈ పాదయాత్రకు డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలె యాదయ్య కొన్నాళ్లకు అధికార కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారమే తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. పాదయాత్రలో కాలె యాదయ్య పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.