రంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్మెన్ శ్రీనివాస్ (Gunman Srinivas) మృతిచెందారు. సోమవారం ఉదయం పటాన్చెరు మండలంలోని భానూరు వద్ద అదుపుతప్పిన బైకు హద్దు రాయిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన గన్మెన్ శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. ఆయన స్వస్థలం శంకర్పల్లి మండలం బుల్కాపూర్. గత కొంతకాలంగా ఎమ్మెల్యే యాదయ్య వద్ద గతకొంత కాలంగా గన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించారు. జిల్లాలోని పెద్దంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి చనిపోయినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేందర్ తెలిపారు. యువకుని వయస్సు 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉంటుందని, నీలం రంగు టీ షర్టు, నలుపు రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుని ఛాతీపై అమ్మ అని పచ్చబొట్టు ఉందని చెప్పారు. ఇది ఆత్మహత్యా లేదా మరే ఇతర కారణాలు వల్ల మరణించాడా అనేది తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ దవఖాన మార్చురీకి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే 8328512176, 9701112343 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.