వరంగల్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ జిల్లాలోని దేవునూరు ఇనుపరాతి గుట్ట భూములు అటవీ శాఖవేనని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంగీకరించారు. దేవునూరు ఇనుపరాతి గుట్ట భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నందునే అందులోకి వెళ్లేవారిని ఆ శాఖ అడ్డుకుంటున్నదని ‘నమస్తే తెలంగాణ’ పేర్కొన్న విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు. అటవీశాఖ ఆధీనంలోని భూముల్లో రైతుల పట్టా భూములు ఉన్నాయనేది తేల్చేందుకు ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికకు అటవీ శాఖ ముఖ్య ప్రధాన సంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) ఇంకా ఆమోదం తెలపలేదని కడియం ధ్రువీకరించారు.
రైతుల పట్టా భూముల విషయమై రెవెన్యూ, అటవీ శాఖలు ఇటీవల చేపట్టిన సంయుక్త సర్వే నివేదికను జిల్లా అధికారులు పీసీసీఎఫ్‌కు పంపించారని తెలిపారు. అయితే, దీనిపై తుది అనుమతులు రాకపోవడంతోనే ఆ భూముల్లోకి ఎవరూ రాకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని వివరణ ఇచ్చారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికార పార్టీలోకి ఫిరాయించిన కడియం తెలిపారు. దేవునూరు ఇనుపరాతి గుట్ట అటవీ భూములను ఇటీవల కొందరు బుల్డోజర్లతో చదును చేసేందుకు ప్రయత్నించడం, అటవీశాఖ అధికారులు వారిని అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు వచ్చిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కడియం శ్రీహరి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం, నారాయణగిరి గ్రామాలకు చెందిన రైతులు ఆ భూముల విషయమై తనను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారని తెలిపారు. అందువల్ల తాను హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు ఈ విషయమై లేఖ రాశానని అంగీకరించారు. రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేసి, హద్దులు నిర్ధారించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను తాను కోరానని చెప్పారు.
రెండు శాఖల సంయుక్త సర్వే నివేదికలో 3,955 ఎకరాలు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నదని తేలినట్టు కడియం అంగీకరించారు. జాయింట్ సర్వే నివేదికలో 23 మంది రైతులకు 43.38 ఎకరాల పట్టా భూమి ఉన్నట్టు తేలిందని, దీనిపై పీసీసీఎఫ్ నుంచి రావాల్సిన అనుమతి పెండింగ్‌లో ఉన్నదని వివరణ ఇచ్చారు. రైతుల పట్టా భూములుగా పేర్కొంటున్న 43.38 ఎకరాలు.. అటవీ శాఖ ఆధీనంలో ఉండటంతో పీసీసీఎఫ్ నుంచి అనుమతి వచ్చే వరకు అందులోకి ఎవరూ రావొద్దని ఆ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పారు. రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయ లేమితో మొదలైన సమస్యను ప్రభుత్వపరంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.