MLA Jeevan reddy | ఆర్మూర్, మే 10: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణ అభివృద్ధి అంటే నిలువెల్లా విషం, విద్వేషమే నిండి ఉన్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయన చదువు, సంధ్యలేని సన్నాసి.. ఎంపీ పదవికే కాదు వార్డు మెంబర్‌గా కూడా పనికి రాడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి నిరోధక విద్రోహిగా మారి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నాడని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బతుకు పాటపైనే కాదు, క్రీడలపైనా తప్పుడు కూతలు కూయ డం బండికే చెల్లిందని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని సూచించారు. దేశంలో క్రీడాభివృద్ధిని పూర్తిగా విస్మరించిన పాపం బీజేపీదేనని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరెస్తామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.
ట్రూత్ లెస్.. యూజ్లెస్ డిక్లరేషన్
సరూర్‌నగర్ సభలో ప్రియాంకగాంధీ విడుదల చేసింది కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ కాదని, ట్రూత్ లెస్, యూజ్ లెస్ డిక్లరేషన్ అని జీవన్‌రెడ్డి విమర్శించారు. అది డిక్లరేషన్ కాదని, కాంగ్రెస్ ఫ్రస్ట్ట్రేషన్ అని కొట్టిపారేశారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్లాగే ఈ యూత్ డిక్లరేషన్ సైతం చెత్తా చెదారమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది కొత్త ఉద్యోగాలిచ్చే డిక్లరేషన్ కాదని, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే డిక్లరేషన్‌గా అభివర్ణించారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇది అసలు నిరుద్యోగుల కోసం కాదని, పదేండ్లుగా పదవులు లేక అసహనంతో కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం రూపొందించిన రాజకీయ డిక్లరేషన్‌గా జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.