హైదరాబాద్: ప్రధాని మోదీపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy)ఫైర్ అయ్యారు. ఈ దేశానికి పట్టిన శని ప్రధాని మోదీ అని విమర్శించారు. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ వేషం వేస్తారని ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయాలకు అడ్డా బీజేపీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్కన్ సుమన్‌తో కలిసి జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రక్షణగా పనిచేస్తున్నదని చెప్పారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసిన మీరు తెలంగాణను ఐటీ హబ్‌గా మారుస్తారా అని ప్రశ్నించారు.
ప్రధాని వస్తే స్వాగతం చెప్పలేని స్థితిని మీరే తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేశారని మీకు వెల్కమ్ చెప్పాలా అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోదీకి స్వాగతం పలకడం లేదన్నారు. మూఢ విశ్వాసాలకు ప్రతీక బీజేపీ అని, రానున్న రోజుల్లో ఆ పార్టీ జీరోగా మారుతుందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ రౌడీయిజం కొనసాగుతున్నదని ఆరోపించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సీఎం కేసీఆర్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ఏం చేశామో చెప్పలేని దుస్థితిలో మోదీ ఉన్నారని విమర్శించారు. మోదీ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ నుంచి బీజేపీని తరమికొట్టాలన్నారు.