Nallagonda | నల్లగొండ ప్రతినిధి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘దండం పెట్టి చెప్తున్నా.. నేను కాంగ్రెస్ కార్యకర్తనే.. ఓ రైతుగా నా బాధ చెప్తున్న. నాకు రుణమాఫీ కాలె. రైతుబంధు ఇంకా అందలే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎనిమిది టర్మ్‌లు పుష్కలంగా నీళ్లొచ్చినయ్. పంటలు మంచిగ పండించుకున్నం. ఈ ఏడాది నాలుగు లక్షల అప్పు ఉన్నది. ఇప్పటికీ బోనస్ డబ్బులు రాలేదు. యాసంగిలో తొమ్మిదెకరాల పొలం పెడితే నాలుగెకరాలు ఎండేపోయింది. ఇంకో ఎకరం కూడా పోయేట్టుంది. నీళ్లు వస్తలేవు. ఈ సీజన్లో మా పొలం పక్కన ఉన్న కాలువకు నీళ్లే రాలేదు. అప్పులు తీరే దారి కనిపిస్తలేదు. దాదాపు ఇక్కడి రైతులందరిదీ ఇదేకథ. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు పదేండ్లు వెనక్కి పోయిండు. కేసీఆర్ గవర్నమెంట్ చరిత్రను ఎవరూ తూడిచేయలేరు. కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు పోలికే లేదు’ అని చెప్తూ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, రైతు ఇమ్మరెడ్డి లింగారెడ్డి. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ గద్గదస్వరంలో ఇలా కుండబద్దలు కొట్టాడు. నీళ్లు పారని ఎస్సారెస్సీ కాలువలు, ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నూతనకల్ మండలంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారి ఎదుట లింగారెడ్డి తన సమస్యలను ఇలా ఏకరువు పెట్టారు.
అప్పుడు యాసంగిలోనూ నీళ్లు పారినయ్
‘కేసీఆర్ ఉన్నప్పుడు యాసంగిలోనూ శనగ చేన్లలో నీళ్లు పారినయ్. పొలాలు పారినయ్.. ఈ యేడు వానకాలం నీళ్లు రాలె. యాసంగి రాలె. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 14 నెలలు అవుతున్నది. 14 సంవత్సరాల కరువు తెచ్చింది. నాకు ఎస్సారెస్సీ కాలువకు రెండు పక్కలా ఏడెకరాల భూమి ఉంది. ఓ పక్క మూడెకరాలు, ఇంకొపక్క రెండెకరాలు ఎండిపోయింది. నేను మూడు బోర్లు వేసిన. రూ.1.50 లక్షల ఖర్చయింది. 200 అడుగులు తవ్వినా బోర్లు పడలేదు. గొడ్లకు కూడా నీళ్ల కరువైంది. ఈ ఏడాది నీళ్లు కండ్లజూడలే. నిరుడు దాకా కేసీఆర్ అప్పుడు పంట ఎండిందన్న రైతు లేడు. ఈ యేడు రైతులంతా బోరుబోరున ఏడుస్తున్నరు. ఈ సర్కారు వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నం. మూడుసార్లు ఎర్రపాడు ఎక్స్‌రోడ్డులో, సూర్యాపేటలో సీఈ ఆఫీసుకు పోయి నీళ్ల కోసం ధర్నా చేసినం. ఎవరూ పట్టించుకోలే. మా ఎమ్మెల్యే సామేలు సుక్క నీళ్లు కూడా రావంటడు అట. ఎనిమిదేండ్లు ప్రభుత్వం ఏలిండు కేసీఆర్. ఏదో మార్పు వస్తది అంటే కాంగ్రెస్‌కు ఓట్లేసినం. ఓట్లేసినందుకు రైతు రెండు చెంపలు వేసుకుంటున్నడు’ అంటూ దుఃఖం దిగమింగుతూ దుమ్మెత్తి పోశాడు కాంగ్రెస్ అభిమాని, నూతనకల్ రైతు సాబాది మల్లారెడ్డి.
కాలువ నీళ్లను నమ్మి కౌలు పట్టిన
పంటలు ఎండుతున్నయని జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్ ఎదుట దిర్శినపల్లికి చెందిన కౌలు రైతు గంట వీరస్వామి ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా ఊరికి కాలువ నీళ్లు వస్తయని నమ్మి 15 ఎకరాల భూమి కౌలుకు పట్టిన. 14 ఎకరాలు వరి, ఒక ఎకరంలో మిర్చి సాగు చేసిన. మూడు బోర్లు, రెండు బావులు ఉండే. కాలువలోకి చుక్కనీరు వదల్లేదు. బోర్లల్లో నీళ్లు తగ్గిపోయినయ్. ఇప్పటికే 8 ఎకరాల వరి పొలం, మిర్చి ఎండింది. కుటుంబమంతా దీనిపైనే ఆధారపడ్డం. 8 లక్షలు పెట్టుబడి పెట్టినం. ఇప్పుడు ఏం చేయాలో తోస్తలేదు. కాలువలోకి నీళ్లొస్తేనే పంటలు గట్టెక్కుతయి. లేదంటే పెట్టుబడి ఎట్లెల్లాలో?కౌలు ఎట్ల కట్టాలో? అర్థమైతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఇట్ల కాలేదు.
కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఇల్లు మునిగే పరిస్థితి వచ్చింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని ఎస్సారెస్సీ ఆయకట్టు రైతులను ఏ రైతును కదలించినా కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు. పక్కా కాంగ్రెస్ కార్యకర్తలైన రైతులు కూడా ఇలా తమ ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు. ఎండుతున్న పంటలను చూసి కంటతడి పెడుతున్నారు. ‘నేను పదెకరాల పొలం పెట్టిన. ఇందులో ఇప్పటికే ఐదెకరాలు ఎండింది. ఆ ఎండిన పొలంలో పశువులను మేపుతున్న. మిగతా పొలం కూడా చేతికొస్తదో? లేదో? కూరగాయల తోట వేస్తే అదికూడా ఎండింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పొలమంతా పారింది. నీళ్లు పుష్కలంగా వచ్చినయ్. ఇప్పుడు గూడ గట్లనుకునే అని పొలం పెడితే అంతా ఎండిపోతున్నది. 5 లక్షలు పెట్టుబడి పెట్టిన. ఏం చేయాలో అర్థమైతలేదు’ అంటూ ముఖానికి రుమాలు అడ్డుపెట్టుకొని విలపిస్తూ నూతనకల్‌కు చెందిన రైతు బండారి కృష్ణారెడ్డి బాధను వెళ్లగక్కారు. ‘నాలుగెకరాల పొలం పెట్టిన. రెండెకరాలు ఎండింది. కాంగ్రెస్ నీళ్లిస్తలేదు’ అని ది వ్యాంగ రైతు ఇమ్మరెడ్డి నవీన్‌రెడ్డి విచారం వెలిబుచ్చారు.
కాళేశ్వరం కేసీఆర్‌కు అప్పజెప్తే మూడోరోజే నీళ్లిచ్చి చూపిస్తం: జగదీశ్‌రెడ్డి, గాదరి
ఇవ్వాళ కేసీఆర్ చేతికి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్తే మూడో రోజే ఎస్సారెస్పీ కాలువలకు నీళ్లిచ్చి చూపిస్తమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎండిన పంటపొలాలను పరిశీలించిన అనంతరం వారు నూతనకల్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతీ ప్రాతినిథ్యం వహిస్తున్న మోతె మండలంలోని చివరి గ్రామంలోని చివరి ఎకరా వరకు నీళ్లిచ్చి తీరుతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమీ కాలేదని, కన్నెపల్లి పంప్‌హౌస్ ఆన్ చేస్తే కాలువల్లో నీరు పారుతుందని తెలిపారు. నీళ్లిస్తే కాళేశ్వరం బానే ఉన్నదని ప్రజలు భావిస్తారన్న కుట్రతోనే ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం, మంత్రుల బుర్రలకు పుండు పుట్టే, ఇక్కడి పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. డీబీఎం 69 కింద ఒక్కసారి కూడా నీళ్లు ఇవ్వలేదని, ఎందుకు నీళ్లు పారడం లేదో నీటిపారుదల శాఖ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ చెప్తున్న ప్రతి మాటా అబద్ధమేనని, అందుకు ఎండుతున్న పంటలే నిదర్శమని చెప్పారు. కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్‌పై చేస్తున్న కుట్రలను ఆపి ఎస్సారెస్పీకి నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలని జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్ డిమాండ్ చేశారు.