చివ్వెంల/సూర్యాపేట : గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పేర్కొన్నారు. సోమవారం చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో శాశ్వతంగా గుర్తుండేలా జరిగిన అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పనితీరు అమోఘం అని కొనియాడారు.
దేశంలో ఏ అవార్డు ప్రకటించినా అందులో తెలంగాణ ఉండటం దీనికి నిదర్శనం అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు ఇక్కడి పట్టణాలే పోటీ అన్నారు. పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి జరి గిందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.
అనంతరం మరో రెండు రోజుల్లో పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లను జగదీష్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ కుమారి, జెడ్పీటీసీ సంజీవ నాయక్, వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుధీర్ రావు, ఎంపీడీవో లక్ష్మి, ఎంపీఓ గోపి, పాల్గొన్నారు.