హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. అందులో భాగంగా ఢిల్లీకి నిధులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం, ఆంధ్రాకు నీళ్లను యథేచ్ఛగా పారిస్తున్నది’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర్ డ్యామ్‌పై 2023 నాటి స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సాగర్‌ను ఆంధ్ర బలగాలకు అప్పగించే ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. నిర్ణయం మార్చుకోకపోతే రైతులు ఎక్కడికక్కడే ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు చేయాలనుకున్న నీళ్ల దోపిడీ చేస్తున్నారని, అందుకే సాగర్ ప్రాజెక్టుపై ములుగుకు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్ స్థానంలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందని తెలిపారు.
దీంతో ఇప్పుడు సాగర్ ప్రాజెక్టు పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిందని, కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్‌కు రానివ్వనేలేదని గుర్తుచేశారు. సీఆర్పీఎఫ్కు సాగర్‌ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టు బాధ్యతలను అప్పగించడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మళ్లీ సమైక్య పాలన రోజులు వస్తున్నాయని, రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ పథకాలు వెనక్కి పోతున్నాయని, నదీజలాల్లో రాష్ట్ర హక్కులు సైతం హరించుకుపోతున్నాయని నిప్పులు చెరిగారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాను పూర్తిగా వినియోగించుకుంటే, ఈ కాంగ్రెస్ పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నీళ్లను అక్రమంగా మళ్లిస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్‌ది వితండవాదం
కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి తాకట్టుపెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ వితండవాదం చేస్తే, అక్కడ లక్ష మందితో కేసీఆర్ సభ పెట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిందన్న విషయాన్ని గుర్తుచేశారు. అయినా కాంగ్రెస్ తీరు మారలేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు అంటే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతున్నదో అర్థంకావడం లేదని తెలిపారు. చంద్రబాబు ద్వారా ప్రధాని మోదీకి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరైందని విమర్శించారు. సాగునీటిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏ మాత్రం సోయి లేదని ధ్వజమెత్తారు.
మరో ప్రజాపోరాటం తప్పదు?
తెలంగాణలో మరో ప్రజాపోరాటం తప్పదని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. నీళ్లు, నిధులు లేక ఉమ్మడి పాలన నాటి పరిస్థితులు ఇక్కడ మళ్లీ దాపురించాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మన నీటి వాటాలు మనకు రావాలని, ప్రాజెక్టులపై మన నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్క తప్పుకు వంద అబద్ధాలు అన్నట్టుగా హెచ్‌సీయూ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఒంటెద్దు నరసింహారెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు తాగునీటి కటకట వర్షాలు రావడం ఆలస్యమైతే రానున్న రోజుల్లో హైదరాబాద్ తాగునీటికి కటకట ఏర్పడుతుందని జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో ఏటా రెండు పంటలకు నీళ్లందించామని, కానీ, ఇప్పుడు కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగునీళ్ల మంత్రి కాదని, ఆయన కన్నీళ్ల మంత్రి అని ఎద్దేవా చేశారు. స్వయంగా నీళ్ల మంత్రి నియోజకవర్గంలోనే సాగునీళ్లు లేక రైతులు కంటతడి పెడుతున్నారని తెలిపారు.