రేవంత్ హెలికాప్టర్లో పోతూ చూస్తే నల్లగొండ జిల్లాలో కనిపించిన అభివృద్ధంతా కేసీఆర్ పాలనలో జరిగిందే. 3 నిమిషాల్లో కేసీఆర్ నల్లగొండకు చేసిన 300 పనులు నేను చెప్తా! రేవంత్‌కు 300 గంటలు టైమ్ ఇచ్చినా తాను చేసిన ఒక పనీ చెప్పలేరు.
– జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : ‘కేసీఆర్ వస్తే నిధుల వరద పారేది.. అదే రేవంత్ వస్తే బూతుల బురద పారుతున్నది. మూసీ కంపును మించి సీఎం నోరు కంపు కొడుతున్నది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లగొండలో నిన్న సీఎం రేవంత్‌రెడ్డి ఖాళీ కుర్చీల ముందట వికారాన్ని ప్రదర్శిస్తూ కేసీఆర్, కేటీఆర్‌పై కేవలం వాంతి చేసుకుని పోయారని ఎద్దేవా చేశారు. ఈ మీటింగ్ కోసం అధికారులు ప్రయాస పడటం తప్ప ఒరిగిందేమీ లేదని, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లగొండకు ఒక రూపాయి కూడా రాలేదని చెప్పారు. ఊ అంటే కేసీఆర్ మీద పడి ఏడ్వటం రేవంత్‌కు అలవాటుగా మారిందని, చివరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కేసీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారని, దీనిని బట్టి కాంగ్రెస్-బీజేపీలు ఒకటేనని అర్థమవుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయంటేనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో తెలుస్తున్నదని, అసెంబ్లీ సమావేశాలు పెడితే ఎవరు వస్తారో? ఎవరు పారిపోతారో? తేలుతుందని స్పష్టంచేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భూపాల్‌రెడ్డి, గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, రామచంద్రునాయక్, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, బోనగిరి దేవేందర్, సైదిరెడ్డి, కృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం నల్లగొండ భలో సీఎం రేవంత్ మాట్లాడిన తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి సీఎం స్థానంలో ఉండి బాడీ షేమింగ్ చేస్తూ, సంసారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు.
ఢిల్లీకి వంద కోట్లు.. మరి నల్లగొండకు?
రూ.50కోట్లు పెట్టి పీసీసీ పదవి కొనుకోవచ్చని రేవంత్‌ను చూసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలే బాధపడుతున్నారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇకడ వందల కోట్లు వసూలు చేసి యాదాద్రి సాక్షిగా ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ వచ్చి తమను తొకేస్తున్నదని పాత కాంగ్రెస్ నేతలు వాపోతున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి కనిపించిన అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలో జరిగిందేనని, నల్లగొండకు రేవంత్ ఒక రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇంకా 30వేల రైతుభరోసా బాకీ ఉన్నదని, అదంతా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. మూడు నిమిషాల్లో కేసీఆర్ నల్లగొండకు చేసిన 300 పనులు తాను చెప్పగలనని, రేవంత్‌కు 300 గంటలు టైమ్ ఇచ్చినా తాను చేసిన ఒక పని కూడా చెప్పలేరని విమర్శించారు. సబ్జెక్టు, సంసారం లేనివాళ్లే తిట్లు అందుకుంటారని, తాము ఆ స్థాయికి దిగజారలేమని స్పష్టంచేశారు. నాగార్జునసాగర్‌లో నీళ్లున్నా రైతులకు ఇవ్వలేని దుస్థితి దాపురించిందని, చంద్రబాబుకు నీళ్లు దోచిపెట్టడం తప్ప రేవంత్‌కు ఏమీ తెలియదని ఆరోపించారు. కేటీఆర్‌కు ఉన్న ఆదరణ ఏమిటో, రేవంత్‌ను ప్రజలు తిడుతున్న తిట్లేందో చూస్తే అర్థమవుతుందని, నల్లగొండ ప్రజలకు చేసిన ద్రోహానికి సీఎం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొడ్తరు : భూపాల్‌రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని తెలిసి ఈయన రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆరోపించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా చేసినా కోమటిరెడ్డి నల్లగొండకు చేసింది ఏమీలేదని విమర్శించారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకోవడానికి నల్లగొండ క్లాక్‌టవర్ దగ్గరకు చర్చకు రావాలని కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో రూ.15వేల కోట్లతో నల్లగొండను తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను జగదీశ్‌రెడ్డి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. జగదీశ్‌రెడ్డిని మూడు ఫీట్లు అని, తనను చేయిలేనోడని కోమటిరెడ్డి హేళన చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆకారాలు ముఖ్యం కాదని, అభివృద్ధి ముఖ్యమని హితవు పలికారు. హామీలు అమలు చేయకుండా మోసాలు చేస్తే ప్రజలు కాంగ్రెస్ నేతలను ఉరికిచ్చి కొడ్తారని హెచ్చరించారు.
కాలకేయుడు వచ్చినట్టు ఉన్నది: గొంగిడి సునీత
రేవంత్‌రెడ్డి నల్లగొండకు వస్తే ముఖ్యమంత్రి వచ్చినట్టు లేదని.. బాలీవుడ్ విలన్ అమ్రిష్‌పురి, బాహుబలిలో కాలకేయుడు వచ్చినట్టు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎద్దేవా చేశారు. విద్యుత్ మంత్రిగా ఎన్నో విజయాలు సాధించిన జగదీశ్‌రెడ్డిని బాడీ షేమింగ్ చేసే హకు రేవంత్‌కు ఎకడిదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఎప్పుడూ కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతుంటారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల జపం చేయ డం తప్ప ఆయనకు ఏమీ చేతకాదన్నారు. కేసీఆర్ జిల్లాకు వస్తే వందల కోట్ల నిధులు ప్రకటించేవారని గుర్తుచేశారు. జగదీశ్‌రెడ్డి శంఖం పూరిస్తే కాంగ్రెస్ నేతలు పారిపోవడం ఖాయమని హెచ్చరించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రేవంత్‌ను అడ్డుకొన్నారని, రేవంత్‌ను తొకడానికి నల్లగొండ రైతులే చాలని, తస్మాత్ జాగ్రత్త.. అని సునీత హెచ్చరించారు.
రేవంత్ ఏమైనా ఆజానుబాహుడా: రవీంద్రకుమార్
రేవంత్‌రెడ్డి సీఎం పదవిలో ఉండి వ్యక్తులను టార్గెట్ చేస్తూ రోత మాటలు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకనే తిట్ల పురాణం అందుకున్నారని ఆక్షేపించారు. రేవంత్‌రెడ్డి ఏమైనా ఆజానుబాహుడా? జగదీశ్‌రెడ్డి కంటే ఎకువ ఎత్తు ఉన్నాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇసుక, మట్టి, లిటిగేషన్ భూములపైనే శ్రద్ధ ఉన్నదని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టుల్లో కేసీఆర్ హయాంలో 80శాతం పనులు పూర్తయితే, ఈ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని, మట్టి అమ్ముకోవడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడం చేతకావడం లేదని విమర్శించారు.